కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి… సీఐటీయూ మహాసభలో వక్తలు

0
73

దేశంలో, రాష్ట్రంలో కొలువైన ప్రభుత్వాలు తమ కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. కార్మికులంతా సంఘటితంగా ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన సీఐటీయూ చీరాల పట్టణ, మండల మహాసభలో ఆయన మాట్లాడారు. చీరాల పట్టణ, మండల సీఐటీయూ మహాసభ స్థానిక ఎన్జీఓ హోమ్ లో ఆదివారం జరిగింది. ముందుగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు పతాకావిష్కరణ చేసి మహాసభను ప్రారంభించారు.

అనంతరం మహాసభకు హాజరైన కార్మికులను ఉద్దేశించి ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఇతర పార్టీల ఎంపిలను తన పార్టీలో చేర్చుకుని కార్మిక వ్యతిరేక బిల్లులను చట్టసభల్లో ఆమోదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తన కార్మిక విధానాల, ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాశ్మీర్ లో 370వ అధికరణం రద్దు వంటి అంశాలను ముందుకు తెచ్చారని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

దేశ సంపదను తన తన మద్దతుదారులైన అంబానీ, ఆదానిలకు దోచిపెట్టడంలో ప్రధాని మోడీ అరితేరిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే తన ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను బయటపెట్టుకుందని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు పాలభిషేకాలు చేసిన ఆశా వర్కర్లను జీతాలు ఇవ్వమని అడిగినందుకు అరెస్టులు చేసి నిర్బంధించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆయన ధ్వజమెత్తారు.

తమకు రావాల్సిన ఏడు నెలల వేతనాల కోసం ఆశా కార్యకర్తల అలుపెరుగని పోరాటం చేసి లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనతోనే తనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తేడా లేదని జగన్ నిరూపించుకున్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ చేస్తున్న పోరాటంలో కార్మికులు, ఉద్యోగులు కలిసి రావాలని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. కాగా మహాసభలో గత మూడేళ్ళ కాలంలో సీఐటీయూ చేసిన కార్మిక ఉద్యమాల నివేదికను కార్యదర్శి నలతోటి బాబురావు ప్రవేశపెట్టారు. మహాసభకు దేవతోటి నాగేశ్వరరావు, చిరంజీవి అధ్యక్షత వహించారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఎమ్. వసంతరావు, ఏవి రమణ, బి శ్రీనివాసరావు, ఝాన్సీలక్ష్మి, రేఖారాణి, సింగయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here