విఆర్వో వ్యవస్థ రద్దు చేస్తాం… సీఎం సంచలన ప్రకటన

0
51

ఉద్యోగులకు భయపడేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు. అవసరం అయితే వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘చట్టాలు మార్చొద్దు. కొత్తవి తేవొద్దు అంటే నడుస్తదా? అవసరమైతే కొత్త చట్టాలు తేవాల్సిందే. ఉద్యమంలో ఎవరికీ భయపడలేదు. అలా ఉన్నాం కాబట్టే తెలంగాణ సాధ్యమైంది. రాష్ట్రం బాగుపడాలని, ప్రజలకు మేలు కలగాలనే దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళుతున్నాం.

రాష్ట్రంలో లంచం లేని పరిస్థితి రావాలి. ఇందుకు దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం. దీనిపై నలుగురు ఉద్యోగులకో, వారికో వీరికో భయపడేది లేదు. చట్టాలు రూపొందించేది ఉద్యోగులు కాదు. వారు ప్రభుత్వం చెప్పిన పని మాత్రమే చేయాలి. కుక్క.. తోకను ఊపుతుందా!? తోక కుక్కను ఊపుతుందా!? ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిర్దేశించే పరిస్థితి ఉండొద్దు’’ అని కేసీఆర్ హెచ్చరించారు.

ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఉండదని, ఉద్యోగులే ప్రభుత్వాన్ని శాసించి.. చట్టాలు చేస్తే ఇక శాసన సభ ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకని నిలదీశారు. మంది మాటలు పట్టుకుని సమ్మెలు చేస్తే మీరే నష్టపోతారని వీఆర్వోలను ఉద్దేశించి కేసీఆర్‌ హెచ్చరించారు. ‘‘అసలు వీఆర్వో వ్యవస్థను తీసేస్తామని మేం చెప్పినమా? దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవేళ తొలగించాల్సి వస్తే తప్పకుండా తొలగిస్తాం. వీఆర్వోలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఒకప్పుడు ఉన్న పటేల్‌, పట్వారీ వ్యవస్థ పోలేదా!? వారి అరాచకాలు ఎక్కువయ్యాయి కాబట్టి తీసేశారు. ఇప్పుడు వీఆర్వోలు వారి కన్నా డబుల్‌ అయితే.. తీసేయక తప్పదు కదా!’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here