ఏపీ సీఎం జగన్ కి కేసీఆర్ షాక్…!

0
78

సచివాలయ భవనాలు వృధాగా ఉన్నాయి కాబట్టి ఇచ్చేసాం అన్నారు. మన వాటా కింద రావాల్సిన ఆస్తులు అడగమంటే మౌనం వహించారు. ఢిల్లీలో ఏపీ భావంమాదే మీకు వాటా లేదు అన్నారు. ఇలా రాష్ట్రానికి రావాల్సినవి వరుసగా వదిలేస్తున్న ఏపీ ప్రభుత్వ తీరుపై నిరసన స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా అన్నిటికీ మౌనంగా తల ఊపుతున్నారులే అనుకున్నారో ఏమో తెలంగాణ సీఎం ఏపీపై మరో బండ పడేసారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో జగన్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇరుకునపడేశారు. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతుండగానే వివాదంలో ఉన్న మొత్తం ఉద్యోగులను ఆంధ్రకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జగన్‌ సర్కారును ఆత్మరక్షణలో పడేశాయి. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొందని, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా విభజన సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరిస్తున్నారని ఇంతకాలం ప్రభుత్వపరంగా వినిపిస్తున్న వాదనను తెలంగాణ ప్రభుత్వ ఏకపక్ష ఉత్తర్వులు గట్టి దెబ్బ తీశాయి.

ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వర్గాలు నోరుమెదపడం లేదు. బాధిత ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం విజయవాడలోని విద్యుత్‌ సౌధలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను కలిసి ఈ పరిణామంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై కొందరు మహిళా ఉద్యోగులు ఆయన వద్ద భోరున విలపించారు. గట్టిగా పోరాడాలని, మన ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి తేవొద్దని ఉద్యోగ సంఘాల నేతలు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకు గట్టిగా విజ్ఞప్తి చేశారు. ‘ఇద్దరు సీఎంలూ కలిసి కూర్చుని మాట్లాడుతున్నారంటే సామరస్యంగా పరిష్కారమవుతుందని అనుకున్నాం. తెలంగాణ సీఎం అడగగానే హైదరాబాద్‌లో మనకు చెందిన సచివాలయ భవనాలను ఆంధ్ర సీఎం ఇచ్చేస్తే ఇరు రాష్ట్రాల మధ్య సోదర భావానికి ఉపయోగపడుతుందని భావించాం. ప్రత్యామ్నాయంగా ఏదీ తీసుకోకుండానే సచివాలయ భవనాలను మన ప్రభుత్వం వదులుకుంది. ఇంత త్యాగం చేస్తే ఆంధ్ర ఉద్యోగులకు తెలంగాణ ఇచ్చిన బహుమతి ఇది. మొత్తం నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలన్నీ తుంగలో తొక్కి ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చింది.

మన సీఎంకి ఏం విలువ ఇస్తున్నారో అర్థం కావడంలేదు’ అని ఉద్యోగ సంఘ నేత ఒకరు వాపోయారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి తొలగించిన మొత్తం 1,157 మంది ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, వారిలో ఎవరైనా తమకు తాముగా ఆంధ్రకు రావాలనుకుంటేనే వారి ఐచ్ఛికాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించిందని.. కానీ ఈ ఉద్యోగులందరినీ ఆంధ్రకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులివ్వడం దారుణమని మరో నేత వ్యాఖ్యానించారు. కేంద్రం నియమించిన కమలనాథన్‌ కమిటీ అన్ని శాఖల్లో ఉద్యోగులను నిర్దుష్ట ప్రాతిపదికన విభజించి ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరిపిందని, స్థానికతతో సంబంధం లేకుండా అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశంలో ఇరు వైపుల వాదనలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకొనే బాధ్యతను అప్పగిస్తూ రిటైర్డ్‌ జస్టిస్‌ డీఎం ధర్మాధికారి కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిటీ సమావేశం శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో జరగనుంది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈ సమావేశంలో తమ వాదనను గట్టిగా వినిపించాలని ఆంధ్ర విద్యుత్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here