మెగా దాహం తీర్చిన సైరా…. చిత్ర సమీక్ష

0
48

సైరా : దేశం గర్వించే వీరుడి కథ
చిత్రం పేరు : సైరా నరసింహారెడ్డి
నటీనటులు : చిరంజీవి, అమితాబచ్చన్, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి
దర్శకుడు : సురేందర్ రెడ్డి
నిర్మాత : రామ్ చరణ్
సంగీతం : అమిత్ త్రివేది
మాటలు : బుర్రా సాయిమాదవ్
సాహిత్యం : సిరివెన్నెల, చంద్రబోస్
విడుదల తేది : 2019 అక్టోబర్ 2
నిర్మాణ వ్యయం : సుమారు 270 కోట్లు

చరిత్ర పుటల్లో మరుగునపడిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంగ్లేయుల బానిసత్వంలో భరతమాతకు ఊపిరిపోసేందుకు 1848లో తెల్లదొరలను ఎదిరించి ఉరికంబానికి వేలాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అలాంటి వీరుడి కథను వెండితెరపై ఆవిష్కరిస్తూ మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం…సైరా నరసింహారెడ్డి. 12 ఏళ్లుగా నిరీక్షించి… రెండేళ్లపాటు శ్రమించి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాహుబలి స్ఫూర్తితో భారతీయ చిత్రంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సైరా….ఉయ్యాలవాడ జీవితాన్ని ఎంత వరకు ప్రతిబింబించింది? శ్వాసలోనూ, గుండె ఘోషలోనూ దేశంకోసం పరితపించిన ఆ పరాక్రమశాలి పోరాటం భావితరానికి ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందో… సైరా సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఇదీ కథ…

భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీసి ధన, మాన, ప్రాణాలను కొల్లగొడుతున్న ఆంగ్లేయులకు రేనాడు ప్రాంతంలో గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. దత్త మండలాలతో కూడిన రేనాడు ప్రాంతాన్ని… 61 మంది పాలేగాళ్లు చిన్న చిన్న సంస్థానాలుగా చేసుకొని పరిపాలిస్తుంటారు. అయితే వారి మధ్య ఐక్యత లేకపోవడంతో పన్ను వసూలు చేసే హక్కును ఆంగ్లేయులు తీసుకుంటారు. పన్ను చెల్లించని ప్రాంతాల ప్రజల నుంచి భూములు, ధాన్యాన్ని లాక్కుపోతారు. కరువొచ్చినా పంటలు పండకపోయినా పన్నులు కట్టాల్సిందేనని హింసిస్తుంటారు. ఈ క్రమంలో ఉయ్యాలవాడ పాలేగాడు మజ్జారి నరసింహారెడ్డి(చిరంజీవి) బ్రిటీష్ పాలకులకు ఎదురుతిరుగుతాడు. బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రజాపోరాటాన్ని మొదలుపెడతాడు. ఈ పోరాటంలో మిగతా పాలేగాళ్లు నరసింహారెడ్డికి ఎలా సహకరించారు? నరసింహారెడ్డి పోరాటం తర్వాత తరాలకు ఎలా స్ఫూర్తినిచ్చి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందనేదే సైరా కథ.

ఎలా ఉందంటే….

ఈ కథ ఓ చారిత్రక నేపథ్యంతో కూడుకున్న కథ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ప్రేరణగా తీసుకొని సైరా కథను తెరకెక్కించినట్లు తొలిసన్నివేశంలోనే ప్రేక్షకులకు వివరించిన దర్శకుడు… స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మిబాయి (అనుష్క) పోరాటంతో సైరా కథను ఆరంభించాడు. మజ్జారి నరసింహారెడ్డి మిగతా వీరులకు ఎలా స్ఫూర్తిగా మారాడానే అంశంతో తన కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు…61 సంస్థానాల్లో పన్నులు వసూలు చేసేందుకు ఆంగ్లేయులు చేసే ఆకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజల కష్టాలను చూసిన నరసింహారెడ్డి ఆంగ్లేయులపై పోరాటం చేయడానికి ఏం చేశాడు, ఐకమత్యం లేని సంస్థానాలను ఏకతాటికైకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాల్లో బ్రిటిష్ అధికారి తల నరికిన నరసింహారెడ్డి ప్రేక్షకుడ్ని కథలో లీనమయ్యేలా చేశాడు. అందుకు తగినట్లుగా ద్వితీయార్థాన్ని కూడా చక్కగా మలిచిన సురేందర్ రెడ్డి… కథ, కథనాల్లో వేగం పెంచి కదనరంగంలో నరసింహారెడ్డి ఎలా కొదమసింహామయ్యాడో చూపిన విధానం అద్భుతమనే చెప్పాలి. అయితే చారిత్రక ఆధారాల్లో ఉన్నట్లుగా కాకుండా కొంత కథను సినిమాకు అనుకూలంగా మార్చిన సురేందర్ రెడ్డి… క్లైమాక్స్ లో భావోద్వేగాలను జోడించి కథను విషాదాంతం కాకుండా ముగించి సైరాను విజయతీరానికి చేర్చాడు.

ఎవరెలా చేశారంటే….

సైరాలో నటీనటులంతా తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారనే చెప్పాలి. ముఖ్యమంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తన 12 ఏళ్ల కలల ప్రాజెక్టుగా చెప్పిన మెగాస్టార్ చిరంజీవి అందుకు తగినట్లుగానే సిద్ధమై తన నట విశ్వరూపాన్ని తెరపై ఆవిష్కరించాడు. పోరాట యోధుడిగా చిరు ఆహార్యం, నటన సైరాకు ప్రధాన ఆకర్షణ కాగా… పోరాట సన్నివేశాలు చూస్తే చిరంజీవిలో ఆ జోష్ ఏ మాత్రం తగ్గలేదనిపిస్తుంటుంది. నేటితరం కథానాయకులకు ధీటుగా యాక్షన్ సన్నివేశాలను రఫ్ ఆడించిన చిరంజీవి… మాటలతో సైరాను మరింత రక్తికట్టించారు. గోసాయి వెంకన్న పాత్రల్లో అమితాబచ్చన్ కనిపించి తెలుగు తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే సిద్ధమ్మ పాత్రలో నయనతార ఎప్పటిలాగే తనదైన నటనతో ఆకట్టుకోగా… తన నాట్యంతో ప్రజలను చైతన్యపర్చే పోరాట యోధురాలిగా లక్ష్మి పాత్రలో తమన్నా ఔరా అనిపిస్తుంది.

పాలేగాళ్లుగా రామిరెడ్డి పాత్రలో జగపతిబాబు పాత్ర కీలకమని చెప్పాలి. పతాక సన్నివేశాల్లో జగపతిబాబు పాత్ర కథను కీలక మలుపు తిప్పుతుంది. అవుకురాజు గా కిచ్చా సుదీప్, పాండిరాజాగా విజయ్ సేతుపతిలు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
ప్రతి మరణం ఈ మట్టికి కొత్త ఊపిరి పోయాలి, స్వేచ్చ కోసం పోరాడిన ఊపిరి ఆగదు లాంటి అర్థవంతమైన మాటలతో బుర్రా సాయిమాదవ్ మరోసారి తన కలానికున్న బలాన్ని చాటుకున్నారు. సిరివెన్నెల, చంద్రబోస్ సాహిత్యం, అమిత్ త్రివేదీ సంగీతం సైరా నరసింహారెడ్డికి జీవంపోశాయి. విజువల్ ఎఫెక్ట్స్ సైరాకు అదనపు హంగులద్దాయి. అన్నింటికంటే మించి ఈ కథను నమ్మి ఎంతో శ్రమించి నిర్మించిన రామ్ చరణ్.. ప్రతి సన్నివేశంలోనూ తన తండ్రికి తగిన సినిమా తీశాననే విషయాన్ని గుర్తుచేసేలా సైరా కనిపిస్తుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here