వైసీపీ పీకేకి 50 కోట్లా… టీడీపీ పీకేల‌కు వంద కావాల్సిందే

స‌ల‌హాలిచ్చి పార్టీని ఓట‌మి బాట ప‌ట్టించిన ప్ర‌శాంత్ కిషోర్‌కు వైసీపీ రూ.50 కోట్లు ఇస్తుందట‌. మ‌రి మూడు వారాల‌కు పైగా క్షేత్ర స్థాయిలో క‌ష్ట‌ప‌డి పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చి రికార్డు సృష్టించిన మాకు ఓ వంద కోట్ల‌యినా ఇవ్వారా? ఇది టీడీపీలోని పీకేల ధ‌ర్మ సందేహం. అయితే, ఆ వంద కోట్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు ఎవ‌రు చెప్పాలి. ఎలా ఇప్పించుకోవాలి. ప్ర‌స్తుతం నంద్యాలలో ప్రచారం చేసి వ‌చ్చిన టీడీపీ ఎన్నిక‌ల టీమ్‌లో చ‌ర్చంతా దీనిపైనే. అయితే ఇదంతా స‌ర‌దాగానే సుమా.

మొన్న‌నే ముగిసిన నంద్యాల ఉప ఎన్నికతో రాష్ట్రంలో రేగిన వేడి అంతా ఇంతా కాదు. అధికార టీడీపీ త‌ర‌పున పెద్ద సంఖ్య‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అక్క‌డ మ‌కాం వేసి ప్ర‌చారం చేశారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ఏకంగా 13 రోజుల పాటు నంద్యాల‌లోని గ‌ల్లీ గ‌ల్లీ తిరిగారు. అలాగే, త‌న పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే అన‌బ‌డే రాజ‌కీయ స‌ల‌హాదారు సేవ‌ల‌ను కూడా వాడుకున్నారు. ఈ క్ర‌మంలోనే పీకేకు రూ.50 కోట్ల వ‌ర‌కూ ముట్ట‌జెప్పార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యాన్నే టీడీపీ త‌ర‌ఫున నంద్యాల‌లో ప‌ని చేసిన మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి, ఎమ్మెల్యేలు తాజాగా త‌మ సంభాష‌ణ‌ల్లో ప్ర‌స్తావించారు. స‌చివాల‌యంలో టీడీపీ నేతంల‌తా పిచ్చాపాటి మాట్లాడుకుంటుండ‌గా ఈ సంభాష‌ణ వ‌చ్చింది. ఎన్నిక‌ల‌లో స‌ల‌హాలిచ్చిన పీకేకు జ‌గ‌న్ రూ.50 కోట్లు ఇచ్చార‌ని అయినా వైసీపీ ఓడిపోయింద‌ని, అదే స‌మ‌యంలో తాము ఎంతో క‌ష్ట‌ప‌డి పార్టీని అద్బుత మెజార్టీతో గెలిపించుకొచ్చామ‌ని అలాంటి త‌మ‌కు క‌నీసం దానికి రెండితంలు ఓ వంద కోట్ల‌యినా ఇవ్వాల‌ని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ్యాఖ్యానించారు.

దానికి కొన‌సాగింపుగా మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి… ఆ వంద కోట్ల‌ను 16 మందికి పంచాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ ప‌ద‌హారు మంది ఎవ‌రూ అంటే ఎన్నిక‌ల‌లో టీడీపీ త‌రఫున ప‌నిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేల బృంద‌మ‌ని తేల్చారు. అయితే, ఎంత ఇవ్వాలో… దాన్ని ఎవ‌రెవ‌రికీ పంపిణీ చేయాలో క్లారిటీ వ‌చ్చంది. కానీ, అధినేత ఎదుట ఈ డిమాండ్ తీసుకెళ్లే సాహ‌సం చేసేది ఎవ‌రు అన్న‌దానిపైనే ఆ నేత‌ల్లో సందిగ్ధ‌త నెల‌కొంది. దాంతో మ‌ళ్లీ ఆదినారాయ‌ణ రెడ్డే స్పందించారు. ఏదోక స‌మ‌యంలో తానే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాన‌ని చెప్పారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లాల‌న్న నిర్ణ‌యంతో ఈ స‌ర‌దా సంభాష‌ణ ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *