బాబు రెండుసార్లు… మరి జగన్ కనపడరేం…?

ఏపీలోని అధికార విపక్ష పార్టీలు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఒక్క అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నంద్యాలలో గెలవడం ద్వారా మరో రెండేళ్లలో జరగాల్సిన ఎన్నికల్లో విజయానికి తొలి అడుగు వేయాలని టీడీపీ… వైసీపీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు నంద్యాల వెళ్లి వచ్చారు. ఒక రోజు రాత్రి అక్కడే బస చేశారు. తల్లి తండ్రి లేని పిల్లలంటూ సెంటిమెంట్ రాజేశారు. ఇక మంత్రుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. చాలామంది మంత్రులు నంద్యాల మీదే కాంసెంట్రేట్ చేశారు.

అయితే వైసిపి అధినేత జగన్ మాత్రం ఇప్పటి వరకు నంద్యాలలో పర్యటించలేదు. సాంకేతికంగా ఈ సీట్ మాదే అని చెబుతున్న జగన్ ఉప ఎన్నికల ప్రచారంలోకి ఇంకా దిగలేదు. దీనికి వైసిపి నేతల వాదన వేరేలా ఉంది.

ఇంకా నోటిఫికేషనే రాని ఈ ఎన్నిక కోసం సీఎం చంద్రబాబు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సీట్లో గత ఎన్నికల్లో టిడిపి అబ్యర్ధిని ఓడించి వైసీపీ అభ్యర్థి గెలిచారని అలాంటి సీట్ తమదేనంటూ పోటీ పెట్టి టీడీపీ ఇప్పుడు సంప్రదయాలంటూ సెంటిమెంట్ పండించాలని చూస్తుందంటూ విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన అంతిమ విజయం తమదేనని బల్ల గుద్ది చెబుతున్న వైసిపి నేతలు… నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్ రంగంలోకి దిగుతారని అంటున్నారు.

నంద్యాల లో తమ విజయం ఖాయమని ఓటమి భయంతోనే అధికార పార్టీ అక్కడ మోహరించిందని తాము అంత కష్టపడక్కర్లేదని విపక్ష నేతలు చెబుతున్నారు. తమ అధినేత ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రంగంలోకి దిగి చక్రం తిప్పుతారని వైసిపి నేతలు అంటున్నారు.

ఇక్కడ కొందరి ధర్మ సందేహం ఏమిటంటే… ప్రస్తుతం బిజెపికి దగ్గరవుతున్న జగన్ ఆ మేరకు ఈ ప్రాంతంలో ఎక్కువగా వున్న మైనార్టీలని దూరం చేసుకుంటున్నారేమో అని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *