బండ్ల గణేష్ కి షాద్ నగర్ షాక్..!?

తాను ప్రాణానికి ప్రాణంగా అభిమానించే పవన్ కళ్యాణ్ ని ఆయన స్థాపించిన జనసేనను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరారు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. కాంగ్రెస్లో చేరిన వెంటనే తాను ఎమ్యెల్యే అయిపోయినట్లేనని.. కాంగ్రెస్ 104 సీట్లు రావడం ఖాయమని గణేష్ సంచలన ప్రకటనలు కూడా చేసారు. పైగా ఎమ్యెల్యే అయిన తర్వాత చేయాల్సిన ప్రమాణాన్ని అప్పుడే చేసేస్తూ హడావుడి చేశారు. అయితే ఢిల్లీ తీసుకెళ్లి రాహుల్ తో కండువా కప్పించి కాంగ్రెస్లో చేర్చుకున్న నేతలు గణేష్ కి సీట్ ఇచ్చే విషయంలో మాత్రం హ్యాండ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందుకు కారణం కాంగ్రెస్ తొలి జాబితా విధాలా కావడమే. ఈ జాబితాలో బండ్ల సొంత నియోజకవర్గం షాదనగర్ లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన ప్రతాపరెడ్డికే సీటు ఖరారు చేయడం. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉందా లేదా అన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టికెట్ ఖాయం చేసుకున్న తర్వాతే కాంగ్రెస్‌లో చేరారని కొందరు.. కాంగ్రెస్ కీలక నేతలతో బండ్లకు ఉన్న సత్సంబంధాల వల్ల టికెట్‌ ఖాయమవుతుందన్న నమ్మకంతో పార్టీలో చేరినట్లు ఉన్నారని మరికొందరు చెబుతున్నారు.

బండ్ల గణేష్ తాను పుట్టి పెరిగిన షాద్ నగర్ టికెట్ ఆశించినట్లు మొన్నటి వరకు ప్రచారం చేశారు. తనకు స్థానికంగా ఉన్న వ్యాపార సంబంధాలు, సర్కిల్ తనకు ఓట్లను రాల్చుతుందని బండ్ల భావించినట్లు సమాచారం. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఫైనల్ చేసిన జాబితాలో షాద్ నగర్ స్థానాన్ని ప్రతాప్ రెడ్డికి కేటాయించారు. చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి 2009లో షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు.

అయితే పోగొట్టుకున్న చోటే తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ప్రతాప్ రెడ్డి షాద్ నగర్‌ నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ వై.అంజయ్య యాదవ్‌నే అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతాప్ రెడ్డి మాత్రమే ధీటైన అభ్యర్థిగా కాంగ్రెస్ తలపోసింది. షాద్ నగర్ నుంచి బండ్లకు అవకాశం లేదని తేలిపోవడంతో ఇప్పుడు ఎక్కడ నుంచి ఆయన పోటీకి దిగుతారన్న అంశం చర్చనీయాంశం అయింది. అసలు కాంగ్రెస్ పార్టీకి బండ్లకు టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేక ఆయనే టికెట్ ఆశిస్తున్నారా అనే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తుది జాబితా వాడితే కానీ స్పష్టం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *