బీజేపీ చీఫ్‌గా త్రిష‌… అధ్య‌క్ష పోస్టు ఆమెకేనా?

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావే వాన‌… అంటూ అడిపాడి అంద‌రి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్న త్రిష ఇప్పుడు కాషాయ కండువా క‌ప్పుకోబోతున్నారా? అవున‌నే అంటున్నాయి ఆ పార్టీ వ‌ర్గాలు. ద‌క్షిణాదిలో విస్త‌రించాల‌న్న‌ది బీజేపీ ప్ర‌స్తుత ప్ర‌ధాన ల‌క్ష్యం. అందుకోసం బీజేపీ త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల్లో బ‌ల‌ప‌డాల‌ని ఉవ్విళూరుతోంది. ఇందులో క‌ర్ణాట‌క, తెలంగాణ‌ల‌లో వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి రావాల‌ని కూడా క‌ల‌లు కంటోంది. క‌ర్ణాట‌క‌లో గ‌తంలో అధికారంలోకి వ‌చ్చింది కాబ‌ట్టి అక్క‌డ అవ‌కాశం ఉండొచ్చేమో కానీ తెలంగాణ‌లో మాత్రం ఇంకా ఆ పార్టీ ఓన‌మాల స్టేజ్‌లోనే ఉంది.

ఇక‌, కేర‌ళ‌లో ఉనికి కోసం ఇప్పుడిప్పుడే పోరాటం మొద‌లు పెట్టింది. అక్క‌డ బ‌లంగా ఉన్న క‌మ్యూనిస్టులు బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్ట‌నీయ‌రాద‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. పోతే త‌మిళ‌నాడు. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడులో ఉన్న అనిశ్చిత ప‌రిస్థితిని ఆస‌రాగా చేసుకుని అన్నాడీఎంకేను త‌మ గుప్పిట ప‌ట్టాల‌ని బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. అయితే, శ‌శిక‌ళ అందుకు స‌సేమీరా అన‌డం… ఆ త‌ర్వాత ప‌రిణామాల‌లో ఆమె జైలుకు పోవ‌డంతో ఇప్పుడు అన్నాడీఎంకేను న‌డుపుతున్న ప‌న్నీరుసెల్వం, ప‌ళ‌ని స్వామిల‌ను మాత్రం కాషాయ‌ద‌ళం తమ అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంది. అన్నాడీఎంకేను త‌న‌లో క‌లిపేసుకునే విష‌యంలో బీజేపీ స‌క్సెస్ కాలేక‌పోయినా… ఆ పార్టీ బీజేపీకి జూనియ‌ర్ ఉండ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇదే స‌మ‌యంలో అన్నాడీఎంకేను చెప్పుచేత‌ల్లో పెట్ట‌కుని తాను కూడా రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారిని పార్టీలోకి తేవాల‌ని బీజేపీ త‌ల‌పోస్తోంది. ఇందులో భాగంగానే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ వంటి వారికి గాలం వేసింది. వీరిలో ర‌జ‌నీ ఏ సంగ‌తీ తేల్చ‌కున్నా… క‌మ‌ల్ మాత్రం తాను బీజేపీకి పూర్తి వ్య‌తిరేకం అని స్ప‌ష్టం చేశారు. దాంతో ఇప్పుడు బీజేపీ దృష్టి కొన్నేళ్లుగా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్‌పుల్ హీరోయిన్‌గా ఉన్న త్రిష మీద ప‌డింద‌ని స‌మాచారం. త్రిష‌ను పార్టీలోకి తేగ‌లిగితే త‌మిళ‌నాడులో తాము బ‌ల‌ప‌డ‌డం సులువ‌న్న‌ది బీజేపీ పెద్ద‌ల యోచ‌న‌. అందులో భాగంగానే త్రిషాతో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని అవ‌స‌ర‌మైతే ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ఇవ్వ‌డానికి కూడా బీజేపీ సై అంటోంద‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే నాలుగు రోజుల క్రితం త్రిష‌కు ఒక ఫోన్ వ‌చ్చింద‌ట‌. అమిత్ షా కార్యాల‌యం నుంచి ఫోన్ చేసిన వ్య‌క్తి.. సార్ మాట్లాడ‌తారు లైన్ ఉండ‌మ‌ని కోర‌డంతో అదేదో ఆక‌తాయి ఫోన్ అనుకుని త్రిష క‌ట్ చేసేసింద‌ట‌. తిరిగి అదే నంబ‌రు నుంచి ప‌దే ప‌దే ఫోన్ రావ‌డంతో దాన్ని రిసీవ్ చేసుకున్న త్రిష అవ‌త‌ల అమిత్ షా మాట్లాడుతుండ‌డంతో నిశ్చేష్టుల‌య్యార‌ట‌. ఆ త‌ర్వాత తేరుకుని అమిత్ షా చేసిన ప్ర‌తిపాద‌న‌పై త‌రువాత మాట్లాడ‌తాన‌ని చెప్పి పెట్టేశార‌ట‌. అయితే, త్రిష‌కు రాజ‌కీయాల మీద ఆస‌క్తి లేద‌ని అందుకే దానిపై ఇంకా ఎటూ తేల్చుకోలేద‌ని త‌మిళ‌నాడు సినీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల క‌థ‌నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *