బాబు హామీకి ఏడాది… అడుగు ముందుకు ప‌డ‌లేదు!

గురువారం రోజుల ఏరువాక‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు అట్ట‌హాసంగా ప్రారంభించారు. రాయ‌దుర్గంలో సీఎం స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డిపి అన్న‌దాత‌ల‌ను పొలాల్లోకి పంపించారు. అయితే, ఇదే రాయ‌దుర్గంలో ప‌ది నెల‌ల క్రితం చంద్ర‌బాబు ఇచ్చిన హామీ అమ‌లు మాత్రం అడుగు కూడా ముందుకు క‌ద‌ల్లేదు. స‌రిగ్గా ప‌ది నెల‌ల క్రితం రాయ‌దుర్గం మండ‌లం గుమ్మ‌ఘ‌ట్ట‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఏడాదిలోపు బైర‌వానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ప‌నులు పూర్తి చేసి చూపిస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు. ఇదే కాదు మ‌రికొన్ని హామీలు కూడా ఇచ్చారు. అయితే, అవేవీ కూడా నేటికి అమ‌లుకు నోచుకోలేదు.

భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) పనులు పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు పెట్టుకున్న స్వ‌యం ప్ర‌క‌టిత గ‌డువు మరో రెండు నెలల్లో పూర్తి కానుంది. అయితే ఇప్పటివరకు పనులే మొదలు పెట్టలేదు. క‌నీసం టెండ‌ర్లు కూడా పిల‌వ‌లేదు. ఆ ప్రాజెక్టు ఫైలుపై ఇప్ప‌టికీ రాజ‌ముద్ర ప‌డ‌లేదు. సీఎం గ‌త ఏడాది ఇచ్చిన హామీ ఇంకా నెర‌వేర‌క‌పోవ‌డంతో ఇక్క‌డి రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్ర‌మంలో సీఎం మ‌ళ్లీ ఏరువాక అంటూ ఇక్క‌డ ప‌ర్య‌టించారు. దాంతో రైతులు గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.

ఇక‌, బీటీపీ ప్రాజెక్టుకు ఇంకా పరిపాలన అనుమతులే లభించలేదు. తొలుత ప్రాజెక్టు ఖర్చు రూ.1300 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తరువాత దాన్ని సవరించి రూ. 1100 కోట్లతో పూర్తి చేయవచ్చునని నివేదిక పంపించారు. అందులో రూ. 800 కోట్లతో బీటీపీ పూర్తి చేయవచ్చునని, మిగిలిన నిధులతో మడకశిర బ్రాంచి కెనాల్‌ను 60 కి.మీ మేర తవ్వవచ్చునని వివరించారు. నేటికీ ఆ ఫైలు ముందుకు కదలకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ఇప్ప‌టికైనా దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టాల‌ని, త‌గు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక‌, గ‌త ఏడాది ఇదే స‌భ‌లో సీఎం ఇచ్చిన మ‌రో హామీ కూడా నేటికి అమ‌లుకు నోచుకోలేదు. ‘జిల్లాలో రైతుల పరిస్థితిని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే జిల్లాకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ. 1030 కోట్లు మంజూరు చేశాను. అదికూడా మీ పొలాల్లో విత్తనం పడేలోపే దాన్ని మీకు అందేలా చర్యలు తీసుకుంటా. ఆ విధంగా మిమ్మల్ని నేను పూర్తిగా ఆదుకుంటా..’ ఇవీ చంద్రబాబు ఆనాటి బహిరంగ సభలో చెప్పిన మాటలు. సీఎం వాగ్దానంపై జిల్లా రైతులు ఆశలు పెంచుకున్నారు. కానీ, ఇప్పటివరకూ ఇన్‌పుట్‌సబ్సిడీ రైతులెవరికీ అందలేదు. అదిగో..ఇదిగో.. అంటూ అధికారులు ఊరిస్తున్నారు తప్ప ఆచరణలోకి తీసుకురాలేదు. జూన్‌ 9 నుంచి పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా అదీ అమలు కావడంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *