చంద్రబాబు డబ్బులు గుద్దే మిషన్ పెట్టారా… టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే… ఆయనను పట్టుకుని “చంద్రబాబు మొగోడే.. ఆయన ఏపీ కోసం డబ్బులు గుద్దే మిషన్ పెట్టినట్లు వున్నాడు” అని ఎవరైనా అనగలరా? ఆ చొరవ… ధైర్యం ఉన్న ఒకేఒక్క నేత టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికే సొంతం. తాను విపక్షంలో ఉండగా బాబు మా మేనమామ అన్న జేసీ ఆ తర్వాత టీడీపీలో చేరి ఎంపీ అయ్యారు. అలాంటి వ్యక్తి బుధవారం అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ఎదురుగా ఆయనపై ప్రశంసలు గుప్పించారు.

అదేదో సినిమాలో వాడు మగాడ్రా బుజ్జి… అన్నట్లు.. జేసీ కూడా నదుల అనుసంధానం గురించి చాలాకాలంగా విన్నామని, ఏ మొగోడు చేయలేదని… కానీ దాన్ని చంద్రబాబు కార్యాచరణలో చేసి చూపించారని జేసీ ప్రశంసలు గుప్పించారు. నదుల అనుసంధానం వల్లే బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లొస్తున్నాయని, అందుకు చంద్రబాబుకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు.

పోలవరానికి కేంద్రం నిధులివ్వకుండా మొండిచేయి చూపినా.. పనులు చేస్తున్నారని.. డబ్బులెక్కడ నుంచి వస్తున్నాయని.. మీ దగ్గరేమైనా అక్షయ పాత్ర ఉందా లేక ఆంధ్రా కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారా.. ఈ రహస్యం మాత్రం చెప్పాల్సిందేనని జేసీ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం చంద్రబాబుపై దివాకర్‌రెడ్డి పొగడ్తలు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *