పెళ్లి అయిన తర్వాతా ఆ యువతితో వున్నా…!

లైంగిక వేధింపులపై చేతన్ భగత్ సంచలన ఒప్పుకోలు ప్రకటన చేశారు. పెళ్లి అయిన తర్వాత కూడా తాను ఓ యువతితో స్నేహం కొనసాగించినట్లు చెప్పారు. టీనా అనే యువతి తనకు చేతన్ భగత్ వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపించారంటూ రచయిత చేతన్ భగత్‌పై ఆరోపణలు చేసింది. ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో టీనా పోస్ట్ చేసింది. ఇది వివాదం కావడంతో తాజాగా ఈ విషయమై చేతన్ భగత్ స్పందించారు. తానే ఆ మెసేజ్‌లను పంపించానని ఒప్పుకున్నారు.

‘ఆ మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌పై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆ స్క్రీన్‌షాట్స్‌ చూడటం ఆలస్యమైంది. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. ముందుగా నా వల్ల ఇబ్బందిపడిన నా భార్య అనూషాకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఆ స్క్రీన్‌షాట్స్‌లో ఉన్నదంతా నిజమే. నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. ఈ స్క్రీన్‌షాట్స్‌ కొన్నేళ్ల క్రితం తీసినవి. ఆ యువతిని నేను చాలాసార్లు కలిశాను. మా మధ్య మంచి స్నేహం ఉంది. ఈ విషయాన్ని నేను మెసేజ్‌లలో కూడా పెట్టాను.

ఆమె మంచి అమ్మాయి. అందంగా ఉంటుంది. నాకు పెళ్లి అయినప్పటికీ కొంతకాలం పాటు భార్యతో కనెక్టివిటీని మిస్సయ్యాను. నేను మాత్రమే కాదు ఆ యువతి కూడా నాతో మెంటల్‌గా కనెక్ట్ అయిపోయినట్టు అనిపించింది. ఆమె చేసిన మెసేజ్‌లను బట్టి అది అర్థం అవుతోంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మా మధ్య ఎలాంటి వివాహేతర సంబంధం లేదు. ఇద్దరం ఎలాంటి అసభ్యకర ఫొటోలు పంపుకోలేదు. నేను కలిసిన వారిలో ఆ యువతి ఎందుకో ప్రత్యేకంగా అనిపించింది. ఏదేమైనా ఆ అమ్మాయితో నా వ్యక్తిగత విషయాలు పంచుకుని ఉండాల్సింది కాదు. మరోసారి ఆ యువతికి, నా భార్యకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.’ అని చేతన్‌ క్షమాపణలు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *