ఆ నాలుగు రాష్ట్రాల్లో మోడీకి షాక్… కాంగ్రెస్ కే జయం

ఆ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి ఉన్న అంచనాలే నిజమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాల మీద ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యతికలరెకత కాంగ్రెస్ కి కలిసి రానుంది. నవంబర్, డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ మొత్తం రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం ఖాయమని తెలిసింది. తాజాగా వెలువడిన జాతీయ మీడియా సర్వేల్లో బీజేపీకి షాక్ తప్పదని తేలింది. మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయాలతో సత్తా చాటనుందని ఏబీపీ న్యూస్‌-సీ ఓటర్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో తేలింది. నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీకి ఈ మొత్తం రాష్ట్రాల్లో ఓటమి తప్పదని తేలిపోయింది.

ఈ నాలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా బీజేపీ అధికారం చేలాయిస్తోంది. వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో ఇక్కడ బీజేపీని రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓడిస్తుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. రాజస్ధాన్‌లో ఓటర్లు సీఎం పదవికి కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్‌ సచిన్‌ పైలట్‌ వైపు అత్యధికంగా మొగ్గు చూపడం విశేషం. ఇక 15 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తిరిగి అధికార పగ్గాలు చేపట్టే స్ధితిలో ఉందని ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైంది. రాజస్ధాన్‌లో సీఎం వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్ధాయిలో నెలకొనడంతో అక్కడ కాంగ్రెస్‌ సులభంగా విజయం సాధించనుందని తేలింది.

ఇక మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో ఇరు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో కొద్దిపాటి తేడా ఉన్నా కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు ఉండటంతో అధికార పగ్గాలు ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందన్నది సర్వే అంచనా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు 142 స్ధానాలు దక్కుతాయని, బీజేపీ కేవలం 56 స్ధానాలకు పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. యువనేత సచిన్‌ పైలట్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న ఓటర్లు 36 శాతం కాగా, ప్రస్తుత సీఎం వసుంధరా రాజేకు  27 శాతం ఓటర్లు మొగ్గు చూపారు.

230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు122 స్ధానాలు దక్కుతాయని ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 90 మంది సభ్యులు కలిగిన చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మేజిక్‌కు ఫిగర్‌ను దాటి 47 స్ధానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 108, 40 స్ధానాలకు పరిమితం కానుంది. కాంగ్రెస్‌, బీజేపీలకు మధ్యప్రదేశ్‌లో వరుసగా 42.2 శాతం 41.5 శాతం ఓట్లు దక్కువచ్చని, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 38.9 శాతం, బీజేపీకి 38.2 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే లెక్క వేసింది. రాజస్ధాన్‌లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసం ఉంటుందని సర్వేలో తేలింది. రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌కు 49.9 శాతం, బీజేపీకి 34.3 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా. వరుస విజయాలతో ధీమాగా మోడీ -షా ద్వయనికి ఇది పెను షాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *