మోడీకి మరో ఎదురు దెబ్బ… ఈసారి బీజేపీకి బలమైన ఎంపిలో!


మొన్ననే పంజాబ్ లో సొంత ఎంపీ సీటును కోల్పోయిన బీజేపీకి… ఇప్పుడు మధ్యప్రదేశ్ లోనూ షాక్ తగిలింది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ దుమ్ము రేపింది. ఎన్నిక ఏదైనా విజయం మాదే అన్న ధీమాతో ఉన్న ప్రధాని మోదికి కాంగ్రెస్ చుక్కలు చూపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో చిత్రకూట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలాంషు చతుర్వేది 14,333 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శంకర్‌ దయాల్‌ త్రిపాఠిపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 66,810 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి 52,677 ఓట్లు సాధించారు.

సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్ధి మరణంతో నవంబరు 9న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రేమ్‌ సింగ్‌ 10,970 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపఎన్నికల్లో ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ తీవ్రస్థాయిలో కృషి చేసింది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సుమారు 12 సభల్లో పాల్గొని పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. రాముడి పేరునూ తెరపైకి తెచ్చారు.

చిత్రకూట్‌లో కాంగ్రెస్‌ గెలుపునకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్లే అక్కడ బీజేపీ ఓడిపోయిందన్న వాదన అర్థరహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నందకుమార్‌ సింగ్‌ చౌహన్‌ వ్యాఖ్యానించారు. అయితే దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి మొదలైందని, దీనికి చిత్రకూట్‌ గెలుపే నిదర్శనమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాల్‌ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్రంలో వచ్చిన ఈ ప్రతికూల ఫలితంతో కాంగ్రెస్ లో జోష్ నెలకొనగా… కమలనాథుల్లో కలవరం మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *