స్నేహితురాలు ఊరేసుకుందని తానూ… ఇద్దరు పోలీసుల విషాదం


స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాడుకున్నారో లేదో కానీ ఆ ఇద్దరు యువతులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. ఇక యువతి మనసు తట్టుకోలేని కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే… నువ్వు లేని లోకంలో నేను ఎలా ఉండాలంటూ మరో యువతి కూడా ఉరి కొయ్యకు వేలాడింది. తెలంగాణలో జరిగిన ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువతులు పోలీసులు కావడం గమనార్హం.

నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెంకు చెందిన నవీన(23) 2009లో ఇంటర్‌ చదువుతుండగా ఈమెకు అదే జిల్లా రాజపేటకు చెందిన మాధవితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. 2014లో మాధవి కానిస్టేబుల్‌గా ఎంపికై వేములపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తోంది. నవీన కూడా 2016లో కానిస్టేబుల్‌గా ఎంపికై శిక్షణ పొందుతోంది. దసరా తర్వాతి రోజు వరకు వీరిద్దరూ కలిసే ఉన్నారు. అయితే, శనివారం మాధవి ఊరేసుకుంది. ఆ విషయం తెలీగానే దిగ్ర్భాంతికి లోనైన నవీన ఉండబట్టలేకపోయింది. అందరూ బ్యారక్‌ వదిలి వెళ్లిన తర్వాత తన రూంలోకి చున్నీతో ఉరి వేసుకుంది.

మాధవి, నవీన ఆత్మహత్యకు కారణాలేంటి? అనే ప్రశ్న టీఎస్ పీఏను, ఇద్దరి కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ‘ఇటీవల మాధవికి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. తొలుత వరకట్నం చర్చకు రాకపోవడం తో పెళ్లి ఖాయమై.. అమ్మాయి కుటుంబీకులు అబ్బాయి తల్లిదండ్రులకు రూ.20వేలు చెల్లించింది. మాధవి కుటుంబ నేపథ్యం పేదరికమే. అయితే, ఇటీవల వరకట్నం ఇవ్వాల్సిందేనని అబ్బాయి తరఫున డిమాండ్‌ వచ్చినట్లు తెలిసింది. రూ.5లక్షలతో మొదలైన బేరసారాలు రూ.14లక్షల దాకా వచ్చి ఫిక్స్‌ అయినట్లు సమాచారం.

తాజాగా మరికొంత డిమాండ్‌ రావడంతో మాధవి తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రతీ అం శాన్ని నవీనతో చర్చించేది. పెళ్లయిన తర్వాత కూడా కట్నం కోసం వేధించే అవకాశం ఉందని, జాగ్రత్తగా అడుగేయాలని నవీన సలహా ఇచ్చిం ది. దీంతో మాధవి కాబోయే వరుడిని దూరం పెట్టింది. అతనికి అనుమానం వచ్చి తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ ఒత్తిడి చేసినట్లు సమాచారం. పలు ఒత్తిళ్లకు గురైన మాధవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్నేహితురాలిని వీడలేని నవీన కూడా ఉరేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *