బిగ్ బ్రేకింగ్ డిఎస్సి మళ్ళీ వాయిదా…?

టీచర్ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మని కష్టపడుతున్న నిరుద్యోగులతో విద్యా శాఖ ఆటలాడుకుంటుంది. దాదాపు గత ఆరు నెలలుగా ఇదుగో నోటిఫికేషన్… అదుగో పోస్టుల భర్తీ అని ప్రకటనలు చేస్తూ వారి జీవితాలతో ఆటలాడుతోంది. ప్రభుత్వ, విద్యాశాఖ నిర్లక్ష్యంతో దాదాపు ఐదు లక్షల మంది అభ్యర్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేస్తాం అంటూ విద్య శాఖ లీక్ చేసిన పరీక్షల షెడ్యూలు కూడా తప్పని తేలింది. తాజాగా మరోసారి డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 10న నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉన్నా… ఆచరణకు అవసరమైన లాంఛనాలు ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా అనివార్యంగా మారింది.

ఇందుకు పూర్తిగా విధ్యా శాఖ నిర్లక్ష్యం… చిత్తశుద్ధి లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఎన్ని పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయాలి, విద్యాశాఖతో పాటు ఏయే శాఖలకు చెందిన ఖాళీలను ఇందులో కలపాలి, ఏ విధానంలో డీఎస్సీ నిర్వహించాలనే అంశాలపై స్పష్టత రాకపోవడంతో పాఠశాల విద్యా కమిషనరేట్‌ ఇంకా తుది షెడ్యూల్‌ను రూపొందించలేదు. వివిధ అంశాలపై స్పష్టత వచ్చాక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖకు చెందిన పోస్టులకు రోస్టర్‌ సిద్ధమైనప్పటికీ ఇతర శాఖల నుంచి రావాలి. మున్సిపల్‌ శాఖ ఇప్పటికే రోస్టర్‌ ఇచ్చి తమ పోస్టులను కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని కోరింది. కానీ ఇప్పుడు మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తోన్న టీచర్లకు బదిలీలు నిర్వహించాలన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో సాంకేతికపరమైన సమస్య తలెత్తే పరిస్థితి నెలకొంది.

బీసీ సంక్షేమశాఖ తమ పరిధిలోని పోస్టుల భర్తీకి సంసిద్ధత తెలిపినా ఇంకా రోస్టర్‌ పూర్తిచేసి పంపాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల నుంచి టీచర్‌ పోస్టుల భర్తీపై బుధవారానికిగానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాళ్లు అంగీకరించినా ఆయా పోస్టులకు రోస్టర్‌ చేసి పంపాల్సి ఉంటుంది. పీఈటీ పోస్టులను పెంచాలన్న డిమాండ్లపైనా విద్యాశాఖలో తర్జనభర్జన జరుగుతోంది.

టెట్‌ కమ్‌ టీఆర్టీ, టీఆర్టీ నిర్వహణకు సంబంధించి గతంలో పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు. డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ కు ముందస్తుగా పూర్తిచేయాల్సిన లాంఛనాలపై నిర్ణయాలు తీసుకోకపోవడంతో అనిశ్చితి ఏర్పడింది. డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినా… ఈ అంశంపైనా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ తేదీనే కాదు… షెడ్యూల్‌ కూడా మారనుంది. దీనిపై ఎప్పటిలోపు స్పష్టత వస్తుందో అర్ధం కాని పరిస్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *