జగన్ బహిష్కరణ…? ఆయనకు కావాల్సిందీ అదేనా..?

“ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చి చంపినా తప్పు లేదు” వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు ఒక వారం రోజులు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగుదేశం శ్రేణులు రాష్ట్రమంతా ఆందోళనలు చేశారు. అది కొద్దిగా చల్లబడుతుండగా తాజాగా మళ్ళీ జగన్ పరుష వ్యాఖ్యలు చేశారు. “సీఎం చంద్రబాబుకు ఉరి శిక్ష వేసినా తప్పు లేదు” అంటూ మరో తీవ్ర వ్యాఖ్య చేశారు. దాంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈసారి ఏకంగా మంత్రులే రోడ్డెక్కి ధర్నా చేశారు. ఈసీకి ఫిర్యాదు చేశారు.

వీటన్నిటి ఫలితంగా… జగన్ మీద ఈసి కఠిన చర్యలు తీసుకునే వీలుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తొలిసారి సీఎంని చంపేయాలంటూ చేసిన వ్యాఖ్యల్ని ఈసి సుమోటోగా తీసుకుంది. అంతకుముందు టీడీపీ నేతలూ ఇదే డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన ఈసి ఆయనకు నోటీసులు ఇచ్చింది. దానికి జగన్ స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని… హామీలు నెరవేర్చెలేదన్న బాధతో ఆవేశంలో అన్నానని వివరణ ఇచ్చారు.

అలా వివరణ ఇచ్చిన జగన్ గురువారం నంద్యాల రోడ్ షోలో మళ్ళీ పరుష వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా సీఎం చంద్రబాబుకు ఉరి శిక్ష వేయలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు ఈసీకి ఫిర్యాదు చేశారు. వీటన్నిటి ఫలితంగా జగన్ మీద ఈసి కఠిన చర్యలు తీసుకునే వీలుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈసీకి ఒకసారి వివరణ ఇచ్చి… మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్నికల సంఘం సహించబోదన్నది వారి వాదన.

అసలే నంద్యాలలో వాతావరణం హాట్ హాట్ గా ఉంది. ఇప్పటికే కేంద్ర బలగాలను మోహరించాలని ఈసి నిర్ణయించింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉందని ఈసి భావిస్తే తగు చర్యలు తీసుకునే వీలుందని టిడిపి నేతలు చెబుతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు కొందరు నేతలను ఎన్నికలు జరిగే ప్రాంతాలను విడిచి వెళ్లాల్సిందిగా ఈసి ఆదేశించింది. ఇలాంటి పరిస్థితే జగన్ కు తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరి కొందరు అయితే… జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి చర్య తనపై తీసుకోవాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. అలా ఈసి కనుక తనను ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని ఆదేశిస్తే పోలింగ్ లో తన పార్టీకి అది కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఉందని ఈ నేతలు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన మీద కక్షతోనే ఇలాంటి పరిస్థితి కల్పించిందని ప్రచారం చేసుకోవచ్చన్నది విపక్ష నేత ఉద్దేశంగా కనిపిస్తుందని వారు చెబుతున్నారు.

అయితే నిజంగానే ఈసి తీవ్ర నిర్ణయం తీసుకుంటే అది జగన్ కి ఉపయోగపదుతుందా… లేకుంటే నడిపే నాయకుడు లేక వైసిపి శ్రేణులు డీలా పడి ఎన్నికకు ముందే చేతులెట్టేస్తారా అన్నది చర్చనీయాంశం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *