కొడుకు వ‌ద్దు… ఫోనే ముద్దు

మ‌ద్యానికి బానిసైన ఓ క‌న్న‌తండ్రి త‌న క‌న్న కొడుకునే అమ్మేసిన ఉదంతం ఇది. నిండా ఏడాది కూడా నిండ‌ని చిన్నారిని అమ్మ పొత్తిళ్ల నుంచి వేరు చేసిన దుర్మార్గం ఇది. ఒడిషాలోని భ‌ద్ర‌క్ జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. స్వీప‌రుగా ప‌నిచేసే బ‌ల‌రాం కొన్నాళ్లుగా మ‌ద్యానికి బానిస‌య్యాడు. ఈ క్ర‌మంలోనే చేతిలో డ‌బ్బు లేక‌పోవ‌డంతో క‌ళ్ల ముందు క‌నిపించిన 11 నెల‌ల కుమారుడిని తీసుకెళ్లి అమ్మేశాడు.

అలా వ‌చ్చిన 23 వేల‌లో ఓ రెండు వేలు పెట్టి మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు. అలాగే, త‌న మ‌రో కుమారుడికి వెండి క‌డియాలు కూడా చేయించాడు. మిగిలిన డ‌బ్బును మద్యం తాగేందుకు వాడుకున్నాడు. ప‌సికందు క‌నిపించ‌క‌పోవ‌డంతో విష‌యం పోలీసుల వ‌ర‌కూ చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రిపి చివ‌ర‌కు క‌న్న‌తండ్రే దోషి అని తేల్చారు.

బలరాంకు ఓ కుమార్తెతోపాటు మరో పదేళ్ల కుమారుడున్నాడు. పిల్లాడి విక్రయంలో త‌ల్లి పాత్ర కూడా ఉందా అన్న అనుమానంతో పోలీసులు బలరాం భార్య సూక్తిని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మాజీ డ్రైవరు సోమనాథ్ సేధీకి ఉన్న 24 ఏళ్ల కుమారుడు మరణించడంతో అతని భార్య విషాదంలో మునిగిపోయింది. దీంతో భార్య విషాదాన్ని దూరం చేసేందుకు సోమనాథ్ డబ్బులిచ్చి బాబును కొన్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *