కేసీఆర్ హెలికాఫ్టర్ లో మంటలు…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో ప్రమాదం జరిగింది. ఆయన హెలికాఫ్టర్ ఎక్కగానే అందులోంచి మంటలు చెలరేగాయి. అయితే అధికారులు మెరుపు వేగంతో స్పందించడంతో కేసీఆర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం కరీంనగర్ నుంచి పెద్దపల్లి పర్యటనకు బయలుదేరే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాఫ్టర్ లోని ఓ బ్యాగ్ నుంచి వెలువడిన పొగలు కలకలం సృష్టించాయి.

 

సీఎం హెలికాఫ్టర్ ఎక్కిన తర్వాత ఓ బ్యాగ్‌లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని సీఎంవో అధికారి గుర్తించారు. వెంటనే ఆ అధికారి హెలికాఫ్టర్ నుంచి బ్యాగ్‌ను బయటకు తీసుకుని పరిగెత్తారు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్ ఆ బ్యాగ్‌ను వంద మీటర్ల దూరం తీసుకొచ్చి పడేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

అయితే ఆ బ్యాగ్ సీఎం కాన్వాయ్‌లోని వైర్‌లెస్ సెట్ అని తెలుస్తోంది. సీఎం హెలికాఫ్టర్‌లోకి వెళ్లడంతో ఆయనతో పాటు హెలికాఫ్టర్లోకి ఆ వైర్‌లెస్ సెట్‌ను తీసుకెళ్లారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది బ్యాటరీ ఓవర్ హీట్ కావడంతో బ్యాగ్‌ నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. అయితే హెలికాఫ్టర్ గాల్లోకి లేవకముందే బ్యాగ్‌ను బయటపడేయడంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది.

 

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తప్పిన ప్రమాదంపై ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారని కేటీఆర్ ట్వీట్ చేశారు. పలువురు మంత్రులు, నేతలు కూడా కేసీఆర్ ప్రమాదంపై ఆరా తీశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *