కొత్త చాన‌ల్ పెడుతున్న ఈ గౌత‌మ్‌రెడ్డి ఎవ‌రు? 

ప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా త‌న హ‌వా కొన‌సాగిస్తున్న మీడియా అటు రాజ‌కీయాల్ని, ఇటు ప్ర‌భుత్వాల్ని శాసిస్తోంది. ఇది ఎంత‌లా అంటే! ప్ర‌భుత్వాల్ని ప‌డ‌గొట్ట‌డం, నిల‌బెట్ట‌డం కూడా మీడియా గుప్పిట్లోకి చేరిపోయింది. మీడియా హౌస్‌లు కూడా త‌మ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా రాజ‌కీయాల‌ను వాడుకుంటున్నాయి. ఎల‌క్ర్టానిక్ మీడియా త‌న జ‌డ‌లు విప్పి విశృంఖ‌లం ప్ర‌ద‌ర్శించాక‌..చాలా మందిని రాజ‌కీయ నేత‌లుగా, మంత్రులుగా ప్ర‌తిష్టించింది. మ‌రికొంద‌రు మంత్రులు కావాల్సిన వాళ్ల‌ని నిర్ధాక్షిణ్యంగా తొక్కేసింది మీడియా. ఇది తెలుగు మీడియా ఎరిగిన స‌త్యం.

 

ఈ వాస్త‌వం మీడియా ద్వారా బాగా తెలిసిన వ్య‌క్తి  పూనూరు గౌత‌మ్‌రెడ్డి.   ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. విద్యార్థి రాజ‌కీయాల నుంచి క‌మ్యూనిస్టు పార్టీ నేత‌గా, బెజ‌వాడ కార్పొరేష‌న్‌ ఓ డివిజ‌న్‌లో కార్పొరేట‌ర్‌గా, ట్రేడ్ యూనియ‌న్ నాయ‌కుడిగా, ప్ర‌ముఖ న్యాయ‌వాదిగా, వృద్ధాశ్ర‌మాలు నెల‌కొల్పి సేవారంగంలోనూ త‌న‌కు తానే సాటిగా నిరూపించుకున్న యువ‌నేత‌. దేవాల‌యాల నిర్మాణం, ఆప‌న్నుల‌ను ఆదుకోవ‌డంలో ముందుంటాడ‌నే పేరున్న గౌత‌మ్‌రెడ్డికి బ‌లం, బ‌ల‌హీన‌త ప్ర‌జ‌లే. అయితే గౌత‌మ్‌రెడ్డికి గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేదు. ప్ర‌జ‌ల‌తోనూ పేచీ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే లొల్లి.

 

అందుకే పూనూరు గౌతంరెడ్డి రాజ‌కీయాల నుంచి మీడియా వైపు మ‌ళ్లుతున్నార‌ని లేటెస్ట్ టాక్‌. ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ వ‌క్త‌గా, ఆ త‌రువాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీడియా నుంచి వినిపించే మంచి వాయిస్ గా గౌతంరెడ్డి  బాగా పేరు సంపాదించారు. పూర్తి వివ‌రాల‌తో ఎల‌క్ర్టానిక్ మీడియాలో పార్టీ వాణి వినిపించ‌డంలో సాధికారికంగా వ్య‌వ‌హ‌రించే గౌత‌మ్ చాలా పేరు సంపాదించుకున్నారు. అయితే 2014 ఎన్నిక‌లలో వైసీపీ అభ్య‌ర్థిగా ఓడిపోయిన గౌత‌మ్‌రెడ్డిని  వైసీపీలో ఓ వ‌ర్గం టార్గెట్ చేసింద‌ని టాక్‌. ఇది గ్ర‌హించ‌లేని గౌత‌మ్ త‌నదైన బాణీలో పార్టీ వాణిని మీడియాలో వినిపిస్తూ పోయారు. అయితే రంగాపై వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కావ‌డంతో గౌత‌మ్‌రెడ్డి పొలిటిక‌ల్ కెరీర్‌కు స‌డెన్‌ బ్రేక్ ప‌డింది. అయితే గౌత‌మ్‌రెడ్డి పార్టీ పొమ్మ‌న్నా..త‌న వెనుక ప్ర‌జ‌లు ఉన్నార‌నే ధీమాతో మొండిగా పొలిటిక‌ల్ పోరు కొన‌సాగిస్తున్నార‌ని బెజ‌వాడ స‌మాచారం. ఇప్ప‌టికీ త‌న కార్యాల‌యం, ఇల్లు వ‌ద్ద వైసీపీ నేత‌గానే ఫ్లెక్సీలు, పోస్ట‌ర్ల‌తో గౌత‌మ్‌రెడ్డి ద‌ర్శ‌నం ఇస్తున్నారు. మ‌రోవైపు త‌న స‌త్తా ఏంటో పార్టీ అధిష్టానానికి తెలియాలంటే మీడియా ఒక్క‌టే మార్గ‌మ‌ని ఈ యువ‌నేత భావిస్తున్నార‌ట‌! అందుకే కొంద‌రు ఎన్ఆర్ ఐల‌తో క‌లిసి భారీ ఎత్తున రెండు రాష్ర్టాల‌లో వ‌చ్చే విధంగా ఓ న్యూస్ చాన‌ల్ తెచ్చే ప‌నిలో ఉన్నార‌ట‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *