టిఆర్ఎస్ కి షాక్…. కాంగ్రెస్ కి గుడ్ న్యూస్… హైకోర్టు సంచలన తీర్పు

కాంగ్రెస్ ఎమ్యెల్యే ల సభ్యత్వ రద్దుపై టిఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు మాత్రం భారీ ఊరట లభించింది. అసెంబ్లీలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై దాడి చేసారంటూ ఇద్దరు ఎమ్యెల్యే ల సభ్యత్వాల రద్దు కేసులో హైకోర్టు తుది ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌‌లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విధించిన సభ్యత్వాల రద్దును హైకోర్టు ఎత్తేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలు కొనసాగుతాయని తీర్పు వెల్లడించింది.

ఆ ఇద్దరి సభ్యత్వం ఎప్పటి వరకు ఉందో…అప్పటి వరకు పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌‌పై దాడికి సంబంధించి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ తీర్పు అడ్డంకి కాదని కోర్టు తెలిపింది.  హైకోర్టు తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభలో గందరగోళం సృష్టించిన సంగతి విదితమే.

ఆ సమయంలోనే కోమటిరెడ్డి విసిరిన మైకు స్వామిగౌడ్ కి తగిలిందని ప్రభుత్వం ఆరోపించింది. దాన్ని సీరియస్ గా తీసుకుని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో సభలో జరిగిన మొత్తం వ్యవహారానికి సంబంధించి వీడియో ఫుటేజ్ ఇవ్వాలని హైకోర్టు కోరినా ప్రభుత్వం స్పందించలేదు. దాంతో హైకోర్టు కేసును విచారించి తుది తీర్పు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *