సానియా ఆ రెండింటికి బీమా చేయించింది…!


కాదేదీ క‌విత‌కు అన‌ర్హం అన్నాడో మ‌హానుభావుడు. ఈ వాక్యాన్ని అనేక విధాల ఉప‌యోగించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా కాదేదీ బీమాకు అనర్హం అని కూడా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇదీ అదీ అని లేకుండా పెళ్లి నుంచి పేరంటం వ‌ర‌కూ… న‌వ్వు నుంచి శ‌రీర భాగాల వ‌ర‌కూ ఇప్పుడు దేనికైనా బీమా ముఖ్యం. సెల‌బ్రిటీల అంద‌రిదీ ఇదే దారి. ఒక‌రు త‌మ న‌వ్వుకు బీమా క‌ట్టేవారైతే… మ‌రొక‌రు త‌మ గాత్రాన్ని ఇన్సూర్ చేసుకునే వారు. ఒక‌రు త‌మ పార్టులు పార్టులుగా త‌మ శ‌రీర భాగాల‌కు బీమా చేయించుకుంటే… మ‌ల్లికా శెరావ‌త్ వంటి వారు శ‌రీరంలోని పార్టుల‌న్నింటికి టోకుగా ఇన్సూర్ చేయించుకున్నారు.

ఈ బీమా సెల‌బ్రిటీల జాబితా చూస్తే చాంతాడంత ఉంటుంది. ఇందులో కొంద‌రి బీమోత్సాహం చూద్దాం. బెట్టె డెవిస్ న‌డుము భాగానికి, జులియా రాబ‌ర్ట్స్ స్మైల్ కోసం సైతం బీమా పాల‌సీలు తీసుకున్నారు. ఇక‌, సానియా మీర్జా త‌న రెండు చేతుల‌కు బీమా క‌డుతుండ‌గా… విజేంద‌ర్ సింగ్ సైతం ఈ విధంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. విదేశాల్లో అయితే, మ‌డోనా, కైలీ మినోగ్ త‌మ శ‌రీర భాగాల‌కు బీమా పాల‌సీల‌ను తీసుకున్నారు.

బాలీవుడ్ తార‌లు మ‌ల్లికా శెరావ‌త్‌, మినీషా లంబా వంటి వారు త‌మ శ‌రీర భాగాల‌కు ఇన్సూరెన్స్ చేయించుకున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. జాన్ అబ్ర‌హం త‌న పిరుదుల భాగానికి బీమా తీసుకున్నాడట. రాఖీ సావంత్ సైతం త‌న శ‌రీరానికి మొత్తం బీమా చేయించాల‌ని ఆలోచిస్తోంద‌ని స‌మాచారం. ఇక‌, భార‌త్‌లోని ప్రముఖ గాయ‌కుల్లో ల‌తా మంగేష్క‌ర్ ఒక‌రు. ఆమె త‌న గొంతు(స్వ‌రానికి)కు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. త‌మ వాయిస్ ఆస‌క్తికరంగా ఉండేందుకు చాలా మంది గాయ‌కులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సైతం త‌న వాయిస్‌కు బీమా చేయించుకున్నారు. అలాగే, పెళ్లి కోసం బీమా పాల‌సీలు ప్ర‌త్యేకంగా వ‌చ్చాయి. కోట్ల రూపాయ‌లు వెచ్చించి వివాహాలు జ‌రిపిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అనుకోని అవాంత‌రం ఎదురైతే ఎందుకొచ్చిన ఇబ్బంది అని ముందుచూపుతో అంద‌రూ బీమా బాట ప‌డుతున్నారు. పెళ్లి వేడుక‌ల‌కే కాదు. చేసుకునే పెళ్లికి బీమా ఉంది. ఏ కార‌ణం చేత‌నైనా పెళ్లి వాయిదా ప‌డ‌టం, ర‌ద్ద‌వ‌డం వంటివి జరిగితే ఈ బీమా అయినా అక్క‌ర‌కొస్తుంద‌న్న ముందుచూపు మ‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *