అదే నిజ‌మైతే రేవంత్‌రెడ్డి అండ్ కో రూటెటు

2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఆధిక్య‌త సాధించింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ క‌లిసి పోటీ చేశాయి. ఆ కూట‌మీ బాగానే సీట్లు సాధించింది. అయితే కేసీఆర్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష అన్నారు. టీడీపీ నుంచి అనేక‌మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు. ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ రేవంత్‌రెడ్డి, ఎల్‌ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి న‌ర్సింహులువంటి నేత‌లు టీఆర్ ఎస్‌ను ఎదురొడ్డి నిలిచారు. ఓటుకు నోటు కేసు తో ఇబ్బందులు ఎదురైనా రేవంత్‌రెడ్డి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని ఢీకొడుతూనే ఉన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీని అధికారంలోకి తేవాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్ ఎస్‌తో టీడీపీ పొత్తు వార్త‌లు ఆయ‌న‌తోపాటు కొంత‌మంది నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేశాయ‌ని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డితోపాటు ఆయ‌న‌తో క‌ల‌సి న‌డిచే నేత‌లంద‌రూ పార్టీలో కొన‌సాగ‌డంపై ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ వాళ్ల‌ను అక్కున చేర్చుకునేందుక ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

విభ‌జ‌న‌తో 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తెలంగాణ‌లోనూ ఘోరంగా దెబ్బ‌తిన్న‌ది. తెలంగాణ ఇచ్చింది… తెచ్చింది మేమే అని ఆ పార్టీ చెప్పినా ప్ర‌జ‌లు టీఆర్ ఎస్‌కే జై కొట్టారు. అయినా కాంగ్రెస్ నేత‌లు నిరాశ ప‌డ‌లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కేసీఆర్‌ను నిల‌దీస్తూ ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ పార్టీ నేత‌లు కేసీఆరే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లూ చేస్తున్నారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని ధీమాగా చెబుతున్నారు. బ‌ల‌మైన నాయకుల కోసం అన్వేషిస్తున్నారు. దానికి అనుగుణంగా పావులు క‌దుపుతున్నారు.

టీఆర్ ఎస్‌, టీడీపీ పొత్తు అంశం తెర‌పైకి రాగానే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. నిజంగా ఆ పొత్తు ఖ‌రారైతే మంచిదేన‌ని భావిస్తోంది. అంతేకాదు ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డితోపాటు ఇత‌ర కీల‌క‌నేత‌ల‌తో ట‌చ్‌లోఉన్న‌ట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డికి ద‌గ్గ‌రిబంధువైన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఇప్ప‌టికే రేవంత్‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. రేవంత్‌తోపాటు పొత్తును వ్య‌తిరేకించే కీల‌క నాయ‌కుల‌కు సీట్లు గ్యారంటీ అని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే రేవంత్‌రెడ్డి పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మ‌రో వైపు బీజేపీ కూడా తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది. ఆ పార్టీ కూడా ఎప్ప‌టి నుంచో ఇత‌ర పార్టీల్లోని ముఖ్య‌నాయ‌కుల‌కు గాలం వేసే ప‌నిలో ఉంది. డైన‌మిక్ లీడ‌ర్ అయిన రేవంత్‌రెడ్డిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టిన‌ట్లు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. తాజా ప‌రిస్థితుల్లో ఆ పార్టీ రేవంత్‌రెడ్డి బ్యాచ్‌కు ఆ పార్టీ గాలం వేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *