వైసీపీకి సమాధి కడుతున్న ఆ నలుగురు వైసిపి నేతలు

రాష్ట్రంలో ప్రతిపక్ష వైసిపి సమాధి కావడానికి ఆ నలుగురు వైసీపీ నేతలు చాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. జగన్ వెంటే వుండే ఆ నేతలే ఆయన పార్టీని ముంచేస్తున్నారని కాల్వ ఎద్దేవా చేశారు. జగన్ కు భజన చేసే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కొడాలి నానిలు వైసిపి అధినేతకు కష్టాలు తెచ్చి పెడుతున్నారని మంత్రి అన్నారు. వీరంతా అడ్డు అదుపు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, టీడీపీ నాయకులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరి ప్రవర్తనతో చివరికి ఆ పార్టీ బంగాళాఖాతంలో కలుస్తుందని జోస్యం చెప్పారు.

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమితో దిమ్మతిరిగి ఆ పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాలలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌.. ఈసీ మందలించినా తీరు మార్చుకోలేదన్నారు. వైసీపీ నాయకుల భాష, వాడుతున్న పదాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమేనన్నారు. ఇలాంటి వ్యవహార శైలితో రాష్ట్రంలో జరుగుతున్న అనేక దుర్మార్గాలు, దుశ్చర్యలకు వైసీపీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతోందని ఆరోపించారు. ‘వైసీపీకి రాష్ట్రంలో చిరునామా లేదు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీయే గల్లంతవుతుంది. జగన్‌ అవినీతికి అన్న.. భవిష్యత్‌లో గుండు సున్నా’ అని మంత్రి కాల్వ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *