కేజ్రీవాల్ చేతిలో మోడీ ప‌రువు ప్ర‌తిష్ట‌లు!

దేశమంతా ప‌నిచేస్తున్న మోడీ గాలి ఆయ‌న సొంత రాష్ట్రంలో ఎదురు తిరుగుతోంది. బీజేపీ అంటే భ‌గ్గున మండిప‌డే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ క‌నిక‌రిస్తేనే ఆ రాష్ట్రంలో క‌మ‌లం మ‌ళ్లీ విక‌సించే అవ‌కాశం క‌నిపిస్తోంది. కేజ్రీవాల్‌కు తీవ్రంగా ద‌గ్గు వ‌స్తే… క‌ర్ణాట‌క‌లో చూయించుకోవాల‌ని మోడీ స‌ల‌హా ఇచ్చారు. ఇప్పుడు అదే కేజ్రీవాల్ సై అంటూ బ‌రిలోకి దిగితేనే రాజ‌కీయంగా గుజ‌రాత్‌లో మోడీకి మంచి రోజులు. ఢిల్లీలోని త‌న ప్ర‌భుత్వాన్ని ముప్పు తిప్ప‌లు పెట్టేందుకు ప్ర‌ధాని స‌హా బీజేపీ నేత‌లంతా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు గుజ‌రాత్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం నిల‌బ‌డాలంటే… వ‌చ్చే ఎన్నిక‌ల‌లో గెల‌వాలంటే ఇదే కేజ్రీవాల్ రంగంలోకి దిగాలంట‌.

ఇదేంది కేజ్రివాల్ బ‌రిలోకి దిగ‌డానికి బీజేపీ గ‌ట్టెక్క‌డానికి ఏమిటి లింకు అని ఆశ్చ‌ర్య‌పోకండి. అక్క‌డే ఉంది అస‌లు సంగ‌తి. గుజ‌రాత్‌ను రెండు ద‌శాబ్దాలుగా పాలిస్తున్ బీజేపీపై ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంద‌ట‌. మోడీ ప్ర‌ధాని అయి వ‌చ్చేసిన త‌ర్వాత ముఖ్య‌మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేత‌ల‌ పాల‌న‌లో అవినీతి పెరిగిపోయింది. పెద్ద‌సంఖ్య‌లో కుంభ‌కోణాలు బ‌య‌బ‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే స్వ‌యంగా ఆర్ఎస్ఎస్ చేసిన స‌ర్వేలోనే బీజేపీ గెలుపు ఈసారి క‌ష్ట‌మేన‌ని తేలింది. పైగా ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో సైతం కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుంది. దాంతో త‌ల‌ప‌ట్టుకున్న బీజేపీ నేత‌లు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అయితే, ఎంత దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టినా… ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే అవ‌కాశం లేద‌ని ఢిల్లీలోని క‌మ‌ల‌నాథులు గ్ర‌హించారు. దాంతోనే పెద్ద సంఖ్య‌లో అభివృద్ధి ప‌నుల‌ను గుజ‌రాత్‌లో చేప‌డుతున్నారు. ఇక‌, రాజ‌కీయంగా చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో గుజ‌రాత్‌లో పోటీ చేయాల‌ని కేజ్రీవాల్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అక్కడి యూత్‌లో కేజ్రీవాల్‌కు మంచి క్రేజ్‌ ఉంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల‌లో కేజ్రీవాల్ పోటీకి దిగితే… ప్రజా వ్యతిరేకత చీలిపోయి మళ్లీ విజయం తమనే వరిస్తుందని బీజేపీ నేతలు కొండంత ఆశ‌తో ఉన్నారు. అయితే, బీజేపీ ఆశించిన‌ట్లు కేజ్రీవాల్ ఒంటరిగా పోటీ చేయ‌కుండా… మోడీకి పుట్టింట్లో చెక్ పెట్టాల‌న్న ఆశ‌యంతో ఇత‌ర విప‌క్షాలైన కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, లెఫ్ట్ పార్టీల‌తో క‌లిసి బ‌రిలోకి దిగితే క‌మ‌ల‌నాథులు గుజ‌రాత్ పీఠంపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *