తెలుగు వారికి మంత్రి ప‌ద‌వులు ఎందుకు ఇవ్వ‌లేదంటే… త‌త్వం గ్ర‌హించిన బీజేపీ

తెలుగు రాష్ట్రాల్లో త‌మ ప‌రిస్థితి ఏమిటో ప్ర‌ధాని మోడీకి, బీజేపీ చీఫ్ అమిత్ షాల‌కు అర్ధ‌మైన‌ట్లే ఉంది. కాయ‌లు కాసే చెట్టుకు నీళ్లు పోస్తే ఉప‌యోగం కానీ… ఒట్టిబోయిన చెట్ల‌కు ఎంత ఎరువేసినా ఉప‌యోగం ఏం ఉంద‌న్న వాస్త‌వాన్ని బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు గ్ర‌హించిన‌ట్లే ఉంది. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ నేటి కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణే. కేబినెట్‌లో కొత్త కేబినెట్ కూర్పులో మోడీ-షా ద్వ‌యం స‌రికొత్త పంధాతో వ్య‌వ‌హ‌రించింది. ద‌క్షిణాదిపై ఫోక‌స్ చేసామ‌న్న ఆ పార్టీ విధానానికి భిన్నంగా ఈ కేబినెట్ కూర్పు జ‌రిగింది. ఎవ‌రైనా ఒక‌ప‌క్క ఫోక‌స్ పెడితే ప్ర‌తి విష‌యంలోనూ దానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు. అవ‌కాశామున్నంత వ‌ర‌కూ ఫోక‌స్ చేసిన ప్రాంతాల‌కే అన్నీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఆ కోణంలోనే ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డాల‌న్న త‌మ ల‌క్ష్యానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల‌పై మోడీ చిన్న చూపు చూశార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

నిన్న‌టి వ‌ర‌కూ తెలుగు రాష్ట్రల్లో ఒంట‌రిగా పోటీ చేసేందుకు బీజేపీ నేత‌లు ఉవ్విళ్లూరారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌న‌కంత సీన్ లేద‌ని వారు గ్ర‌హించారు. దాంతో స‌రిగ్గా నంద్యాల రిజల్ట్‌కు ముందు రోజు తెలంగాణ‌లో ఒంట‌రిగా పోటీ చేస్తాం. ఆంధ్రాలో మాత్రం మా విలువైన మిత్రుడు చంద్ర‌బాబే అని అమిత్ షా స్వ‌యంగా ప్ర‌క‌టించింది. అయితే, ఇవ్వాళ కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో తెలంగాణ‌లోనూ ఒంట‌రి పోరు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప్ర‌ధాని మోడీ త‌న చ‌ర్య‌ల‌తో స‌రికొత్త‌ చ‌ర్చ‌కు ఆస్కారం ఇచ్చారు. తెలంగాణ‌లో కేసీఆర్‌కు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబుకూ తిరుగు లేద‌ని బీజేపీ పెద్ద‌లు గ్ర‌హించిన‌ట్లే ఉంది.

ఆ క్ర‌మంలోనే ఏపీ నుంచి వెంక‌య్య నాయుడు మంత్రి ప‌ద‌వి వ‌దిలేసి ఉప‌రాష్ట్ర‌ప‌తి అయినా ఆ ఖాళీని భ‌ర్తీ చేయ‌లేదు. కంభంపాటి హ‌రిబాబుకు అవ‌కాశం ఇస్తార‌ని చివ‌రి నిమిషం వ‌ర‌కూ ప్ర‌చారం జ‌రిగినా అది కార్య రూపం దాల్చలేదు. స‌రే ఆంధ్రాలో మోడీ వైఖ‌రి సుల‌భంగానే అర్థ‌మ‌వుతోంది.

కానీ, తెలంగాణ‌లో ఎలాంటి ఆరోప‌ణ‌లు లేని సౌమ్యుడిగా పేరున్న ద‌త్తాత్రేయ‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొలగించ‌డం అంద‌రికీ విస్మ‌యం క‌లిగించింది. పైగా ఆర్ ఎస్ఎస్ కూడా ద‌త్తాత్రేయ‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంపై ఆగ్ర‌హంతో ఉంద‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. తెలంగాణ‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాం… కేసీఆర్‌కు మేమే ప్ర‌త్యామ్నాయం… వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ని ఓడిస్తాం అన్న బీజేపీ నేత‌లు ఆ రాష్ట్రం నుంచి ఉన్న ఒక్క మంత్రిని పీకేయ‌డం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారో అన్న చ‌ర్చ మొద‌లైంది. ఇక్క‌డ కూడా కేసీఆర్‌ను ఢీ కొట్ట‌గ‌ల స‌త్తా ఈ రాష్ట్రంలోని బీజేపీకి లేద‌ని హ‌స్తిన‌లోని క‌మ‌ల‌నాథులు గ్ర‌హించార‌ని అందుకే ఏపీలో మాదిరే ఇక్క‌డ కూడా కేసీఆర్ స్నేహంలో చ‌ల్ల‌గా ఉండాల‌ని షా-మోడీ ద్వ‌యం భావిస్తుంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకే బీజేపీ మంత్రుల‌ను పెట్టి ఆ ముఖ్య‌మంత్రుల‌కు, ఆయా ప్ర‌భుత్వాల‌కూ ఏ ఇబ్బంది లేకుండా చూసేందుకు ఏపీకి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా… తెలంగాణ‌కు ఉన్న‌మంత్రి ప‌ద‌విని తీసేసి స‌మ న్యాయం చేసార‌న్న వాద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదంతా గ‌మ‌నిస్తే వ‌చ్చే ఏడాదే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముహుర్తం ముంచుకొస్తుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు సీఎంల‌తో స్నేహం కొన‌సాగించ‌డం మిన‌హా మ‌రో మార్గం లేద‌న్న అభిప్రాయానికి బీజేపీ వ‌చ్చిన‌ట్లే అని అర్థ‌మ‌వుతోంది. ఈ వాద‌నంతా క‌రెక్టే అయినా… బీజేపీ అనుకున్న‌ట్లే తెలుగు సీఎంలు కూడా భావిస్తారో లేదో కాల‌మే చెప్పాలి.

One thought on “తెలుగు వారికి మంత్రి ప‌ద‌వులు ఎందుకు ఇవ్వ‌లేదంటే… త‌త్వం గ్ర‌హించిన బీజేపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *