ప్రధాని మోడీపైనే సీఎం సీరియస్… ఇలాగైతే కోర్టుకేనని హెచ్చరిక

ప్రధాని మోడీ మీద ఎంతటి విమర్శలు అయిన చేయగలిగిన సీఎంలు ఎవరు? అరవింద్ కేజ్రీవాల్… అబ్బే ఆయన ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. నితీష్ కుమార్… ఆయన మోడీ బృందంలో ఒదిగి పోయారు కాదా. మరి మమతా బెనర్జీ… ఆ సత్తా ఉంది కాని ఆమె కూడా పెద్దగా మాట్లాడడం లేదు. చంద్రబాబు… ఆయన వ్యూహాత్మకంగా తగ్గి వుంటున్నారు. ఇక మిగిలింది కేసీఆర్. ఈయన పైసా ఎన్డీయేకి మద్దతుదారే… అడగకున్న రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన వారే.

కానీ… శనివారం ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం మీద… మోడీ మీద తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ‘‘సాగునీరు.. తాగునీరు.. రోడ్లు వంటి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే పనులపై జీఎస్టీ విధించడం అన్యాయం. ప్రభుత్వ కాంట్రాక్టు పనులపై జీఎస్టీ ఎత్తేయండి. కనీసం 5 శాతానికి తగ్గించండి. ఒక్క తెలంగాణకు మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలకూ ఇది భారమే’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులతో కలిసి టీఆర్‌ఎస్‌ మంత్రులు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఒత్తిడి చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి అనేకసార్లు మొర పెట్టుకున్నారు.

అయినా, కేంద్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరించింది. శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కాంట్రాక్టు పనులపై పన్నును 18 నుంచి 12 శాతానికే పరిమితం చేసింది. తప్పితే, రాష్ట్రాల వినతులను పట్టించుకోలేదు. ఈ పరిణామం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగ్రహానికి గురి చేసింది. కౌన్సిల్‌ నిర్ణయంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జీఎస్టీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని తీర్మానించారు. ఇదే అంశంపై ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు.

నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, గృహ, రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలకు జీఎస్టీని ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్‌ జిఎస్టీ సమావేశంలో కోరారు. దాంతో, ఈ నాలుగు ప్రాజెక్టులకూ భవిష్యత్తులో జరగబోయే పనులకు జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నట్లు కౌన్సిల్‌ తీర్మానించింది. అదే సమయంలో, జీఎస్టీ అమల్లోకి రాకముందు ప్రారంభించి ఇప్పటికీ సాగుతున్న పనులకు కూడా 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయంపైనే ఇప్పుడు సీఎం కేసీఆర్‌ మండిపడుతున్నారు. కోర్టు మెట్లు ఎక్కలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *