మోత్కుపల్లి గవర్నర్… వెంకయ్య నోటి నుంచి అసలు సంగతి..?

టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కోరిక తీరబోతుంది. తద్వారా ఎన్నికల తర్వాత టీడీపీకి ఇచ్చిన హామీని ప్రధాని మోడీ నిలబెట్టుకోబోతున్నారు. ఎన్నికలు జరిగిన మూడేళ్ళ తర్వాత కూడా మోత్కుపల్లి విషయంలో కేంద్రంలోని పెద్దలు ఓ నిర్ణయం తీసుకోక పోవడంతో మోత్కుపల్లికి గవర్నర్ పదవి అందని ద్రాక్షేనాని ప్రచారం జరిగింది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోడీ చాలా రాష్ట్రాల్లో గవర్నర్ల భర్తీ చేపట్టినా టీడీపీకి ఇచ్చిన హామీ విషయం ఇప్పటి వరకు తేల్చలేదు.

దానికి తోడు ఇటీవల బీజేపీ… జగన్ పార్టీ వైసీపీకి దగ్గరవుతుందన్న వార్తల నడుమ ఏపీకి ప్రత్యేక హోదా మాదిరే మోత్కుపల్లికి ఇచ్చిన హామీకి కూడా నీళ్లు వదిలేసుకోవాల్సిందేనని వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేకసార్లు ప్రధాని వద్ద మోత్కుపల్లి విషయం ప్రస్తావించిన సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో ఒత్తిడి తేవడం మానేశారు.

అయితే అనూహ్యంగా మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వబోతున్నట్లు… అది కూడా బీహార్లో ఆయన్ని నియమించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా కాబోయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేశారు. ‘త్వరలో తీపికబురు వినబోతున్నార’ని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో వెంకయ్య అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యను టీడీపీ-టీఎస్‌ నేతలు బుధవారం ఆయన నివాసం వద్ద సన్మానించారు.

ఈ సమయంలోనే మోత్కుపల్లికి వెంకయ్య ఈ విషయం చెప్పారు. తెలంగాణలో ప్రముఖ దేవాలయాలైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాల ప్రసాదాలు, దేవుళ్ల పటాలను వెంకయ్యకి అందజేశారు. మైనారిటీ సెల్‌ నేతలు ఖురాన్‌ను బహూకరించారు. మొత్తం మీద వెంకయ్య మాటలు గవర్నర్ పదవి గురించే అని మోత్కుపల్లి అనుచరులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *