బాబుకు ఉచిత స‌ల‌హా… లెక్క త‌ప్పిన కేసీఆర్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యంలో టీడీపీ కూడా ఊహించ‌నంత మెజార్టీ వ‌స్తుండ‌డంతో అధికార ప‌క్షం ఖుషీ ఖుషీగా ఉంది. ఇదే సమ‌యంలో ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ త‌ర్వాత అధికార టీడీపీకి స‌ల‌హాలు ఇచ్చిన వాళ్లు అనేక‌మంది. ఇలా చేసి ఉంటే బావుంటుంది… అలా చేస్తే బావుంటుంది అని చెప్పిన వాళ్లు అనేకం. ఈ క్ర‌మంలోనే ఒక ఆస‌క్తిక‌ర అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ న‌డుస్తోంది. నంద్యాల‌లో హోరాహోరీ ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే… ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ జోరుగా రోడ్ షోలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలోనే హైద‌రాబాద్‌లో ఒక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఎట్ హోం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా ఇద్ద‌రి మ‌ధ్య వ‌న్ టూ వ‌న్ భేటీ జ‌రిగింది.

ఈ స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబుల మ‌ధ్య రాజ‌కీయ అంశాల‌పైనా చ‌ర్చ న‌డిచింది. ఆ క్ర‌మంలో నంద్యాల ప‌రిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. దానికి బ‌దులుగా తాము చేప‌ట్టిన అభివృద్ధి… నంద్యాల‌లో అప్ప‌టి ప‌రిస్థితిని వివ‌రించారు. అన్ని సావ‌ధానంగా విన్న కేసీఆర్ ఓ ఉచిత స‌ల‌హా ప‌డేశారు. నంద్యాల‌లో అభ్య‌ర్థిగా భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి కాకుండా మ‌రొక‌రిని నిల‌బెట్టి ఉంటే ఇంకా బావుండేద‌ని వ్యాఖ్యానించారు. అంటే ప‌రోక్షంగా బ్ర‌హ్మానంద‌రెడ్డిని పెట్ట‌డం ద్వారా టీడీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న విశ్లేషించారు. దానికి అప్ప‌ట్లో చంద్ర‌బాబు న‌వ్వి ఊరుకున్నారు. ఇదే విష‌యంలో అప్ప‌ట్లో మీడియాలోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చింది.

అయితే, ఇప్పుడు నంద్యాల‌లో వ‌చ్చిన ఫ‌లితాన్ని గ‌మ‌నిస్తే… కేసీఆర్ అంచనా త‌ప్పింద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయంగా వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట‌గా పేరొందిన కేసీఆర్ నంద్యాల‌ను స‌రిగ్గా అంచానా వేయ‌లేక‌పోయార‌న్న వాద‌న వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *