పార్టీ విధేయుడికే టీటీడీ ఛైర్మ‌న్‌ ప‌ద‌వి!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల‌మండ‌లి చైర్మ‌న్ పేరు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడైన పారిశ్రామిక‌వేత్త‌కే ప‌ట్టం గ‌ట్టాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ద‌వికి అనేక మంది పేర్లు వినిపించినా మొద‌టి నుంచి రేసులో ఉన్న సీఎం సొంత జిల్లా వ్య‌క్తినే వ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి టీటీడీ చైర్మ‌న్‌గా రెండేళ్లు కొన‌సాగారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం పూర్త‌య్యింది. దాంతో ప‌లువురు ఆశావ‌హులు రంగంలోకి వ‌చ్చారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన పారిశ్రామిక‌వేత్త సీఎం కృష్ణ మూర్తితోపాటు ఎంపీ ముర‌ళీమోహ‌న్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాజీ ఐఏఎస్ అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ త‌దిత‌రులు రేసులోకి వ‌చ్చారు. వాళ్లంద‌రి పేర్ల‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్టేశారు. ఆ త‌ర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన మ‌స్తాన్‌రావు పేరు బ‌య‌ట‌కి వ‌చ్చింది. చివ‌ర‌కు సీఎం ర‌విశంక‌ర్‌, హ‌రికృష్ణ , మ‌స్తాన్‌రావుల పేర్లే ప్ర‌ముఖంగా వ‌నిపించాయి. ఒక ద‌శ‌లో హ‌రికృష్ణ‌కు ప‌ద‌వి ఖ‌రార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే చంద్ర‌బాబు ర‌విశంక‌ర్ వైపు మొగ్గుచూపార‌నీ, ఆయ‌న‌ పేరునే ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ర‌విశంక‌ర్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. గ‌తంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకూ ప్ర‌య‌త్నించారు. మ‌ద‌న‌ప‌ల్లి టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. పార్టీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇప్పుడు ఆయ‌న‌కు టైం వ‌చ్చింది. అందుకే చంద్ర‌బాబు బావ‌మ‌రిది హ‌రికృష్ణనూ ప‌క్క‌న‌పెట్టేశారు. టీటీడీ పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విలో ఆయ‌న‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *