ఆమె మాట‌ల‌కు ఫిదా… 76ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడిలా…

ఫేస్‌బుక్‌లో అమ్మాయి ప‌రిచ‌యం అయ్యింది. మాట‌ల‌తో అర‌చేతిలో వైకుంఠం చూపించింది. మ‌న వాడు బొక్క‌బోర్లా ప‌డ్డాడు. 76 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకున్నాడు. ఇప్పుడు ల‌బోదిబో అంటున్నాడు.

హైద‌రాబాద్‌లోని చిల‌క‌ల‌గూడ‌కు చెందిన పాషా 2009లో అబుదాబీ వెళ్లాడు. అక్క‌డ ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఢిల్లీకి చెందిన కేర‌ల్ మ‌ల్హోత్రా ప‌రిచ‌యం అయ్యింది. ఫోన్‌లోనూ మాట క‌లిపింది. తాను కోటీశ్వ‌రురాలిన‌ని చెప్పి న‌మ్మించింది. త‌న కుమార్తె పేరుతో బ్యాంకులో కోట్లు ఉన్నాయ‌నీ, వాటిని బ‌య‌ట‌కు తీయాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల‌ని చెప్పింది. అందుకోసం కొంత డ‌బ్బు కావాల‌ని కోరింది. పాషా తొలుత 11వేలు ఆమె చెప్పిన ఖాతాలో వేశాడు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు ఆమె అంత‌కు మూడింత‌లు అత‌ని అకౌంట్‌లో వేసింది. ఆ త‌ర్వాత మ‌రికొంత‌మంది స్నేహితుల పేర్లు చెప్పింది. వాళ్లూ కోటీశ్వ‌రుల‌ని చెప్పి న‌మ్మించింది. వాళ్ల‌తోనూ అత‌నితో మాట్లాడించింది.

ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో 2016 జ‌న‌వ‌రి నుంచి 2017 మార్చి వ‌ర‌కు ద‌ఫ‌ద‌ఫాలుగా 76 ల‌క్ష‌లు పంజాబ్‌నేష‌న‌ల్ బ్యాంకులో ఫ‌రీదా, నందిత‌, మ‌మ‌తల‌కు చెందిన ఖాతాల్లో వేయించింది. ఆ త‌ర్వాత ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చేసింది. ఫోన్ నంబ‌ర్ మార్చేసింది. అప్పుడు అర్థ‌మైంది పాషాకు తాను మోస‌పోయాన‌ని. ఇటీవ‌ల పాషా న‌గ‌రానికి వ‌చ్చాడు. ఆమె ఆచూకీ క‌నుగొనేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ ఫ‌లితం లేక‌పోయింది. చివ‌ర‌కు చిల‌క‌ల గూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *