ప్ర‌చారంలో అడ్డ‌దారి… పీకేపై కేసు…?

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా రంగంలోకి దిగిన ప్ర‌శాంత్ కిషోర్ ఉర‌ఫ్ పీకేపై పోలీసు కేసు న‌మోదు కానుందా? అవున‌నే అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు. వైసీపీని వ‌చ్చే ఎన్నిక‌ల‌లో విజ‌య తీరాల‌కు చేర్చేందుకు పీకే రంగంలోకి దిగారు. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కూడా పీకే త‌న‌ను సీఎం చేస్తాడ‌ని బ‌హిరంగ స‌భ‌లోనే ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలో పీకే త‌న బృందంతో రాష్ట్రంలో స‌ర్వేలు చేయ‌డం… సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వ‌, ముఖ్య‌మంత్రి ప్ర‌చారం జోరుగా జ‌రిగేలా చూడ‌డం వంటి ప‌నులు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న బృందం సోష‌ల్ మీడియాలో వేల ఖాతాలు తెర‌చి ప్రభుత్వ వ్య‌తిరేక ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

ఇలా ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్ర‌చారం జోరందుకోవ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన టీడీపీ వ‌ర్గాలు దానిపై దృష్టి పెట్టాయి. దాంతో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పీకే గ‌తంలో ఉత్త‌రాది రాష్ట్రాల‌లో ముఖ్యంగా యూపీ, పంజాబ్ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ కోసం ప‌ని చేశారు. ఆ సంద‌ర్భంలో కూడా వేలాది సోష‌ల్ మీడియా ఖాతాలు సృష్టించి వాటి ద్వారా ప్ర‌చారం చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ త‌ర‌ఫున ప్ర‌చారానికి కూడా మ‌ళ్లీ కొన్ని వేల ఖాతాలు తెర‌వ‌డం ఎందుక‌నుకున్నారో ఏమో… ఆనాటి ఉత్త‌రాది ప్ర‌చారానికి ఉప‌యోగించిన ఖాతాల‌ను ఇక్కడా కంటిన్యూ చేస్తూ టీడీపీ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టారు. దాన్ని ప‌సిగ‌ట్టిన టీడీపీ నేత‌లు పీకే క‌క్కుర్తి వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

ఇప్పుడైతే ఏకంగా సైబ‌ర్ చ‌ట్టాన్ని పీకేపై ప్ర‌యోగించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. చ‌ట్ట ప్ర‌కారం న‌కిలీ ఖాతాల‌తో పీకే చేస్తున్న ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌ని అధికార పార్టీ చూస్తోంది. పీకే బృందం సామాజిక మీడియాలో వేల నకిలీ ఖాతాలను తెరిచి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతోందని టీడీపీ ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించి బయటపెట్టింది. ఈ నేరానికి ప్రశాంత్‌ కిశోర్‌పై సైబర్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌పై ఏడు కేసులు నమోదయ్యాయని, ఇందులో ఒకటి సైబర్‌ కేసని తెలిపారు. ఆ కేసుల వివరాలు తెప్పించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అంటే అన్ని వివ‌రాలు తెప్పించి పీకేను అడ్డంగా బుక్ చేయాల‌ని టీడీపీ చూస్తోంద‌న్న మాట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *