సౌదీ పోతున్నారా… ఈ నరకం గురించి తెలుసుకోండి


పొట్ట చేతపట్టుకుని ఎందరో భారతీయులు అరబ్ దేశాల బాట పడుతున్నారు. అలాంటి వారంతా అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో… ఎంతటి నరకం చవి చూస్తున్నారో ఇప్పటికే చాలా ఉదంతాల్లో చూసాం. ఆ కోవలోదే ఈ కథనం. కుటుంబానికి ఆదరవుగా ఉండేందుకు సౌదీ వెళ్లిన ఓ యువతి అక్కడ తాను అనుభవిస్తున్న నరకాన్ని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తనను ఆదుకోవాలని… ఇంకెవరూ ఈ నరకంలోకి రావద్దంటు వేడుకున్నారు.

పంజాబ్‌లోని దవాడ్మీ సిటీకి చెందిన ఓ యువతి యేడాది క్రితం సౌదీకి వెళ్లింది. అక్కడ ఓ వృద్ధురాలి బాగోగులు చూడాలనేది ఆమెకు ముందుగా చెప్పిన పని. కానీ అక్కడకు వెళ్లాక నరకాన్ని చవిచూస్తోంది. ఈ నరకం నుంచి తనను కాపాడాలంటూ పంజాబ్‌లోని సంగూర్ నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్ సహాయాన్ని కోరింది. ఆ వీడియోలో ఆ యువతి వేడుకలు కింద వీడియోలో చూడండి.

‘భగవాన్ మాన్‌గారూ.. దయచేసి నాకు సహాయం చేయండి. ఇక్కడ నేను నరకాన్ని అనుభవిస్తున్నా. యేడాదిగా చిత్రహింసలు అనుభవిస్తున్నా. గతంలో మీరు హోషియాపూర్‌కు చెందిన ఒకామెను ఇలాంటి నరకం నుంచి రక్షించారు. నన్ను కూడా రక్షించండి. నేను మీ కూతురు లాంటి దాన్ని. దయచేసి నాకు సహాయం చేయండి. నన్ను మోసం చేసి ఇక్కడకు తెచ్చారు. ఇలాంటిది జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను రక్షించాలని, ఈ నరకం నుంచి కాపాడాలని ఇంటి నుంచి పారిపోయి దగ్గరలో ఉన్న సౌదీ పోలీస్ స్టేషన్‌కు ఎన్నోసార్లు వెళ్లా. కానీ వాళ్లు నన్ను బయటకు గెంటేసేవాళ్లు. ఇదే ఇంటికి తెచ్చి అప్పగించేవాళ్లు. ఇక ఈ నరకాన్ని నేను భరించలేను. అన్నం కూడా పెట్టడం లేదు. నన్ను గదిలో బంధించేశారు. చావక ముందే నన్ను కాపాడండి. నాకు పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ప్రస్తుతం వైద్యం జరుగుతోంది. అమ్మ వైద్యం కోసం, పిల్లల చదువు కోసం, కుటుంబ అప్పులు తీర్చడం కోసం సౌదీకి వచ్చా. కానీ ఘోరం జరిగిపోయింది. నేను మోసపోయాను. నాకు ఇంటికి వెళ్లాలని ఉంది.. నా వాళ్లను చూడాలని ఉంది.. ప్లీజ్ నన్ను కాపాడండి.. ఈ నరకం నుంచి బయటపడేయండి..’ అని ఆ పంజాబీ యువతి ఆవేదనతో ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కష్టాలను ఏకరువు పెట్టడమే కాకుండా పంజాబీ సోదరీ సోదరులు ఎవరూ సౌదీకి రావొద్దని వేడుకుంది. ఈ నరకాన్ని వెతుక్కుంటూ వెళ్లొద్దని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *