దొరకని దొంగ కేటీఆర్… ఈ రహస్య భేటీ ఎందుకు?


కాంగ్రెస్ లో చేరిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డి తన మాటల దాడి మొదలు పెట్టారు. నిన్నటి వరకు కేసీఆర్ పైన.. ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన ఇప్పుడు మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేశారు. కుంభకోణాల కాంగ్రెస్‌లోకి మరో దొంగ రేవంత్‌రెడ్డి చేరాడని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శను తిప్పికొట్టారు. రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడని ఎద్దేవా చేసిన కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.

తన ఫేస్‌బుక్‌లో ‘ఇదిగో కేటీఆర్ దాచిన ‘‘సత్యం’’…!’ అనే శీర్షికతో ఓ ఫొటో పెట్టిన రేవంత్ రెడ్డి ఈ దొరకని దొంగ సంగతి చూడమంటూ పిలుపునిచ్చారు. పెట్టుబడుల సేకరణ పేరుతో 2016లో మలేషియా వెళ్లిన కేటీఆర్ అక్కడ అఫీషియల్ ప్రోగ్రాంలో ‘‘అనఫిషియల్’’గా తేజారాజు సన్నాఫ్ సత్యం రామలింగరాజుతో చేసిన మంతనాలు ఏమిటో చెప్పాలని నిలదీశారు.

తేజారాజుతో కలిసి మలేషియన్ ప్రధానితో భేటీ అయిన స్కాం స్టార్ కేటీఆర్‌కు ముందుంది ‘‘క్రోకోడైల్ ఫెస్టివల్’’ అని రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరి స్కాం స్టార్లతో తిరుగుతున్నానని కేటీఆర్ నిన్న రంకెలేస్తూ ఆవేశపడ్డారని, అయితే ఎవరు స్కాం స్టార్లతో తిరుగుతున్నారో సాక్ష్యం ఈ ఫొటోనేనని రేవంత్ రెడ్డి తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.గత ఎడాది జూలైలో కేటీఆర్ మలేషియాకు వెళ్లారని, అప్పటి ఫొటోనే ఇది అంటూ ఆయన ఓవరించారు.

అయితే ఇది నాటి కేటీఆర్ అఫీషియల్ టూర్ ఫొటోల్లో ఎక్కడా కనిపించదని రేవంత్ చెప్పారు. ఈ ఫొటోలో కేటీఆర్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌తో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి సత్యం రామలింగరాజు కొడుకు తేజా రాజు అని, వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ సత్యం రాజలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్ మలేషియాలో రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో ఆయనే చెప్పాలని రేవంత్ ఎద్దేవా చేశారు. స్కాం స్టార్లతో తిరుగుతున్న దొరకని దొంగ ఎవరన్న ‘‘సత్యం’’ తెలంగాణా సమాజం గుర్తిస్తుందని రేవంత్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *