చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు కోలుకోలేని షాక్‌

అక్ర‌మాస్తుల కేసులో జైల్లో గ‌డుపుతున్న శ‌శిక‌ళ‌కు అన్నాడీఎంకే నేత‌లు షాకిచ్చారు. అస‌లే భ‌ర్త అనారోగ్యంతో తీవ్ర‌మైన బాధ‌లో ఉన్న చిన్న‌మ్మ‌కు న‌మ్మిన నేత‌లు కూడా ఝ‌ల‌క్ ఇచ్చారు. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత తాత్కాలికంగా పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన శ‌శిక‌ళ‌ను ఆ పార్టీ ప‌ద‌వుల నుంచి త‌ప్పిస్తూ అన్నాడీఎంకే నేత‌లు నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌య త‌ర్వాత ఆమె వార‌సురాలిగా అన్నింటికి హ‌క్కుదారు తానే అని ప్ర‌క‌టించుకున్న శ‌శిక‌ళ‌ను పార్టీ నుంచి గెంటేశారు. మంగళవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేర‌కు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని తీర్మానించి.. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. ప్రధాన కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్లకు ఉంటాయని సమావేశంలో తీర్మానించారు. జయలలిత నియమించిన ఆఫీస్‌ సిబ్బందిని అలాగే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేసిన ప్రకటనలు, ఆయన చేపట్టిన నియామకాలను పార్టీ ఆమోదించబోదని పేర్కొంది. ఇక రెండాకుల గుర్తు కూడా తమకే చెందుతుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ స‌మావేశం వివ‌రాలు, తీర్మానాల‌ను మంత్రి ఉద‌య్ కుమార్ విలేక‌రుల‌కు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *