మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: సుప్రీం


వైవాహిక జీవితానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. “నా భార్య… నా ఇష్టం” అంటే కుదరదని తాళి కట్టిన భార్య అయినా మైనారిటీ తీరకుండా శృంగారం చేస్తే అత్యాచారమే అవుతుందని సంచలన ఆదేశాలిచ్చింది. అలాంటి భర్తపై రేప్‌ కేసు పెట్టి కటకటాల వెనక్కి నెట్టివేయవచ్చని స్పష్టం చేసింది. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న భార్యతో సెక్స్‌లో పాల్గొనడం అత్యాచార నేరం కిందకే వస్తుందని తేల్చి చెప్పింది.

18 ఏళ్ళు దాటిన భార్యతో ‘పరస్పర ఆమోదం’తోనే సెక్స్‌లో పాల్గొనాలని ‘అత్యాచార చట్టం’గా పిలిచే సెక్షన్‌ 375 ఐపీసీ చెబుతోంది. అదే సమయంలో… ‘‘15 సంవత్సరాలపైబడిన భార్యతో శృంగారం నేరమేమీ కాదు. దానిని అత్యాచారంగా పరిగణించరాదు’ అని ఈ సెక్షన్‌లో పేర్కొన్నారు. ఈ మినహాయింపు సరికాదంటూ పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అత్యాచార చట్టంలో ఇచ్చిన ఈ మినహాయింపు రాజ్యాంగానికి విరుద్ధమేనని స్పష్టం చేసింది.

జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పు చెప్పింది. ఇద్దరు న్యాయమూర్తులు విడివిడిగా తీర్పులు రాశారు. ‘‘15 నుంచి 18 సంవత్సరాల్లోపు వయసున్న భార్యతో శృంగారం నేరం కాదనడమంటే బాలికల శారీరక గౌరవాన్ని, భద్రతను భంగపరచడమే! ఇది పలు ఇతర చట్టాల స్ఫూర్తికి కూడా విరుద్ధం’’ అని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్‌ 375 ఐపీసీలో ఇచ్చిన ఆ మినహాయింపు స్వేచ్ఛ, సమానత్వాన్ని అందిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 21లను ఉల్లంఘిస్తోందని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బాల్య వివాహాలను కట్టడి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *