శబరిమలపై సుప్రీం సంచలన తీర్పు

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని కీలక తీర్పు ఇచ్చింది. *ఇప్పటినుండి అన్ని వయసులకు చెందిన మహిళలు ప్రవేశించవచ్చు. భక్తి పేరుతో మహిళల పట్ల వివక్ష చూపడం సరికాదు. చట్టము సమాజము రెండు కూడా ఒకదానితో ఒకటి పరస్పరం సమానంగా వెళ్ళాలి. మహిళలు పురుషుల కంటే తక్కువ కాదు” అని సుప్రీం కోర్టు తన అదేశాల్లో స్పష్టం చేసింది.

మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. పురుషులతో పాటు మహిళలకూ కూడా సమాన హక్కులున్నాయని తేల్చి చెప్పింది. 10 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న బాలికలు, యువతులు, మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తిచేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారించి కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్షను కోరుతూ పిటిషన్ వేస్తామన్నారు. మతపెద్దలతో చర్చించి వారి మద్దతు కూడగట్టిన తర్వాత పిటిషన్ వేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *