మీకు ఓటు వెయ్యం… మా ఊరికి రావొద్దు… టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్‌

ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ‌లు తగులుతూనే ఉన్నాయి. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో నేత‌లు ఊర్ల‌లోకి అడుగు కూడా పెట్ట‌లేని ఉదంతాలు రోజూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఒక గ్రామంలో చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఎమ్మెల్య‌గా గెలిచిన త‌ర్వాత త‌మ‌ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టని మీకు ఓటు అడిగే హక్కు లేదని.. ఇకపై ఓట్ల కోసం తమ గ్రామానికి రావద్దంటూ కొలిమికుంట గ్రామస్థులు ఆమెను నిల‌దీశారు. టీఆర్ఎస్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా శోభ తన అనుచరులతో కలిసి కొలిమికుంట గ్రామానికి వెళ్లారు.

విష‌యం తెలిసిన గ్రామస్థులు భారీ సంఖ్య‌లో రోడ్డుపైకి వ‌చ్చి శోభ‌ను అడ్డుకున్నారు. త‌మ గ్రామంలోకి రావొద్ద‌ని తేల్చి చెప్పారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు లబ్ధిదారులకు అందకుండా చేశారని, రైతు సమన్వయ సమితిలో అనర్హులకు చోటు కల్పించారని గ్రామస్థులు శోభపై ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు. మరోవైపు చొప్పదండి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న స‌మ‌యంలో సొంత పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన నేత‌లు నేత సుంకె రవి వర్గీయులు సైతం శోభకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘బొడిగె శోభ.. గోబ్యాక్‌’ అంటూ నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక శోభ అక్కడ నుంచి వెన‌క్కి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *