పవన్ సేనలో ఉండవల్లి..!


ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ … పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. కాంగ్రెస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగారు. మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారంలో రామోజీరావుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న వైసీపీలో చేరిపోతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆయ‌న అడుగులు జ‌న‌సేన వైపు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

జ‌న‌సేన కూడా ఆయ‌న‌లాంటి నేత‌ల కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ విద్యార్థిగా ఉన్న‌ప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న ఏలూరులో లా పూర్తి చేశారు. 1972లో జ‌రిగిన జై ఆంధ్రా ఉద్య‌మంలో చురుకైన పాత్ర నిర్వ‌హించారు. ఆయ‌న కాంగ్రెస్ నుంచి 2004లో రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. సినీన‌టుడు , బీజేపీ అభ్య‌ర్థి కృష్ణంరాజును ఓడించారు. 2009 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించారు. టీడీపీ అభ్య‌ర్థి ముర‌ళీ మోహ‌న్‌పై విజ‌యం సాధించారు. అంతేకాదు ఆయ‌న అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందాడు. ఆయ‌న అండ‌తో మార్గ‌ద‌ర్శిపై పోరాటం చేశాడు. ఈనాడు అధిప‌తి రామోజీరావుకు చుక్క‌లు చూపించారు.

2009లోనూ ఆ త‌ర్వాత రాష్ర్ట విభ‌జ‌నకు యూపీఏ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. స‌మైక్యాంధ్ర కోసం గ‌ళం వినిపించారు. అందుకోసం జ‌ర‌గిన ఉద్యమంలోనూ పాల్గొన్నారు. బ‌హిరంగ స‌భ‌ల్లో విభ‌జ‌న‌పై నిప్పులు చెరిగారు. అయినా విభ‌జ‌న ఆగ‌లేదు.
రాష్ర్ట విభ‌జ‌న నేప‌థ్యంలో ఉండ‌వ‌ల్లి రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. కానీ అప్పుడ‌ప్ప‌డు మీడియా ముందుకు వ‌స్తున్నారు. రాష్ర్టంలో టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్ష కురిపిస్తున్నారు. ప్ర‌ధానంగా ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. టీడీపీకి త‌ల‌నొప్పిగా మారారు. ఇదే క్ర‌మంలో ఆయ‌నపై వైసీపీ మ‌నిషి అని ముద్ర వేసేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే వైఎస్‌కు ద‌గ్గ‌రి వాడైన ఉండ‌వ‌ల్లి వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిపైనా సంతృప్తిగా లేరు. ఆ పార్టీపై కూడా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు.

2019లో మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ పోటీ చేయాల‌న్న ఆస‌క్తితో ఉండ‌వ‌ల్లి ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న టీడీపీ, వైసీపీ కాకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన‌లో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. కొత్త రాజ‌కీయ ఆలోచ‌న‌తో వ‌స్తున్న జ‌న‌సేన‌తో క‌లిసి న‌డ‌వాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో జ‌న‌సేనకు కూడా ఉండ‌వ‌ల్లి లాంటి సీనియ‌ర్ల అవ‌స‌రం ఉంది. ఆయ‌న‌లాంటి అనుభ‌వ‌శీలుడైన‌, వాగ్దాటి క‌లిగిన నేత త‌మ వెంట ఉంటే బాగుంటుంద‌ని జ‌న‌సేన కూడా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ పూర్తిస్థాయిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత దీనిపై ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *