మైనార్టీలంతా పాయే… ఇంక వైసీపీ గెలుపు ఎలా?

నంద్యాలలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌ ఓటూ ఇప్పుడు కీల‌క‌మే. ఏ ఒక్క ఓటు పోకుండా వ్యూహ ప్ర‌తి వ్యూహాలు ర‌చించ‌క‌పోతే హోరాహోరీ త‌ల‌ప‌డుతున్న అధికార‌, విప‌క్ష పార్టీల‌కు విజ‌యం అంత తేలిక‌గా దొర‌క‌దు. ఇలాంటి స‌మ‌యంలో వ్యూహాత్మకంగా అధికార పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా… ప్ర‌తిప‌క్ష పార్టీ మాత్రం కొంత వెనుక‌బ‌డింద‌న్న‌ది రాజ‌కీయ ప‌రిశీల‌కుల మాట‌. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా వైసీపీకి న‌ష్టం చేసేలానే ఉన్నాయ‌న్న‌ది వారి వాద‌న‌. మొన్నా మ‌ధ్య ఈ ప్రాంతంలోని విద్యా సంస్థ‌ల అధిప‌తి ఇంతియాజ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ రోజు వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు మైనార్టీ నేత క‌రీం టీడీపీ గూటికి చేరారు. ఇలా  మైనార్టీ నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలో అధికార పార్టీ నేత‌లు స‌ఫ‌లీకృతం అవుతున్నారు.

నిజానికి ఈ ప్రాంతంలో అత్య‌ధికంగా ఉన్న మైనార్టీల ఓట్లే ఎన్నిక‌ల‌లో గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేస్తాయి. ఇలాంటి మైనార్టీ నేత‌లంతా దూరం అవుతుండ‌డంతో ఇక్క‌డి వైసీపీ శ్రేణులంతా క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ బీజేపీకి దూరంగా ఉన్న జ‌గ‌న్ రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌ల నాటి నుంచి త‌న దారి మార్చుకున్నారు. అనూహ్యంగా బీజేపీకి సానుకూలంగా మారారు. అవ‌స‌ర‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో బీజేపీతో క‌లిసి పోటీ చేయాల‌ని కూడా జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే విష‌యాన్ని టీడీపీ త‌మ‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకుంటుంది. మైనార్టీలు కూడా జ‌గ‌న్ బీజేపీవైపు చూడ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్నార‌ని అది ఈ ఎన్నిక‌ల‌లో ఆయ‌న‌కు ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా మైనార్టీ వ‌ర్గాల‌లో పట్టున్న‌నాయ‌కుల‌ను టీడీపీ ఎగ‌రేసుకు పోతుండ‌డం కూడా వైసీపీకి న‌ష్టం చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది.

ఇక‌, జ‌గ‌న్ బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న సంకేతాలు వెలువ‌డిన నాటి నుంచి ఏపీలోని కాంగ్రెస్ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బీజేపీ, జ‌గ‌న్ క‌లిసిపోతే రాష్ట్రంలో తాము తిరిగి బ‌ల‌ప‌డ‌తామ‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే నంద్యాల ఉప ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్‌ బ‌రిలోకి దిగింది. బ‌రిలో నిల‌వ‌డ‌మే కాదు… వ్యూహాత్మ‌కంగా ముస్లిం అభ్య‌ర్థినే బ‌రిలోకి దించింది. టీడీపీ ఎటూ బీజేపీతోనే ఉంది. జ‌గ‌న్ త్వ‌ర‌లో బీజేపీతో దోస్తీ క‌ట్ట‌బోతున్నార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. సైద్ధాంతికంగా బీజేపీకి దూరంగా ఉండే మైనార్టీల చూపు కాంగ్రెస్‌పై ప‌డుతుందని త‌ద్వారా ఆ వ‌ర్గం గ‌ణ‌నీయ‌మైన ఓట్లు పొంద‌వ‌చ్చని కాంగ్రెస్ త‌ల‌పోస్తుంది. ఎన్ని ఓట్లు వ‌చ్చిన కాంగ్రెస్ గెల‌వ‌దు కాబ‌ట్టి దాని విష‌యం వ‌దిలేస్తే… ఇలా మైనార్టీలు దూరం కావ‌డం అంతిమంగా వైసీపీకే న‌ష్టం చేకూర్చనుంది. మైనార్టీ ఓట్ల‌ను కొన్నింటిని కాంగ్రెస్ చీలిస్తే… మిగిలిన ఓటర్లు ఇప్పుడు టీడీపీలోకి వెళ్తున్న నేత‌ల‌తో క‌లిసి అధికార పార్టీనే స‌పోర్టు చేస్తే ఇక త‌మ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌ర‌మేన‌ని వైసీపీ శ్రేణులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *