లోకేశ్‌కు ట‌చ్‌లోకి వ‌చ్చిన ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రు?

నంద్యాల ఎన్నిక‌ల త‌ర్వాత‌… కాకినాడ‌లో వ‌చ్చిన ఫ‌లితాల త‌ర్వాత రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకోబోతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చి… టీడీపీలో చేర‌బోతున్నార‌ని మీడియాలో… సోష‌ల్ మీడియాలో జోరుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఏకంగా ఆ ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు వీరేనంటూ పేర్ల‌తో స‌హా జాబితాలు కూడా వెలువ‌డ్డాయి. అయితే, ఈ వార్త‌ల‌పై అటు పార్టీ మారాల‌నుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు… ఇటు వారిని చేర్చుకోవాల‌నుకున్న టీడీపీ నేత‌లూ ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు. క‌నీసం ఇవ‌న్నీ అవాస్త‌వ‌మ‌ని తోసిపుచ్చ‌నూ లేదు. దాంతో నిప్పు లేకుండా పొగ రాద‌న్న వ్యాఖ్యా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేశ్… టీడీపీలోకి రాబోతున్న వైసీపీ ఎమ్మెల్యేల విష‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ తీరుతో విసిగిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఎంత తొందరగా చేరదామా అని ఉబలాటపడుతున్నారని చెప్పారు. ‘ఆరోగ్యం బాగోలేక పార్టీ సమావేశానికి నేను వెళ్లకపోతే.. తన దొంగ పత్రిక, దొంగ చానల్లో నా తండ్రికి, నాకు విభేదాలున్నాయని జగన్‌ ప్రచారం చేశారు. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితులు సృష్టించడం ఆయనకే చెల్లింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ముఖ్యమంత్రి పరితపిస్తుంటే, జగన్‌ వాటిని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

అయితే, లోకేశ్ చెప్పిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవ‌ర‌న్న దానిపై ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు స‌మీపంగా ఉండే శ్రీ‌కాంత్ రెడ్డి వంటి వారి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో లోకేశ్ చెప్పిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవ‌రా అన్న‌దానిపై ప‌లు ఊహాగానాలు న‌డుస్తున్నాయి. లోకేశ్ చెప్పిన‌దానిని బ‌ట్టి చూస్తే మ‌రికొద్ది రోజుల్లోనే ఆ ఎమ్మెల్యేలు సైకిలెక్కే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *